బ్రెట్‌లీలా ట్రై చేస్తున్నాడు కానీ..: కొత్త కుర్రాడు కార్తీక్ త్యాగిని కెలికిన బెన్‌స్టోక్స్
అబుధాబి: కార్తిక్ త్యాగి.. టీమిండియా అండర్-19 స్టార్ బౌలర్. ఈ ఐపీఎల్ సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే వికెట్‌ను పడగొట్టాడు. ఉత్తర ప్రదేశ్‌లోని హపుర్‌కు చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టకున్నాడు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలర్ల కొరతను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. మ్యాచ్‌లు ఆడుతున్న కొద్దీ మరింత రాటు తేలే అవకాశాలు లేకపోలేదు. మున్ముందు టీమిండియాలో చోటు దక్కించుకునే స్థాయికి ఎదగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఆ బీమర్ స్పీడ్ ఎంతో తెలుసా? వికెట్ కీపర్ సైతం అందుకోలేనంత వేగం: తగిలి వుంటే.. ఖేల్ ఖతం
షార్ట్‌బాల్‌తో డికాక్..
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కార్తీక్ త్యాగి.. మంగళవారం రాత్రి అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ఓవర్‌లోనే ముంబై ఇండియన్స్ ఓపెనర్.. క్వింటన్ డికాక్‌ను బలి తీసుకున్నాడు. 15 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో టాప్ గేరులో ఉన్న డికాక్‌ను ఓ షార్ట్‌బాల్‌తో అవుట్ చేశాడు. త్యాగి విసిరిన షార్ట్ లెంగ్త్ బంతిని భారీ షాట్ ఆడబోయాడు డికాక్. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ జోస్ బట్లర్ గ్లోవ్స్‌లో వాలింది సేఫ్‌గా.
బ్రెట్‌లీని తలపించేలా..
ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన త్యాగి.. 36 పరుగులు ఇచ్చుకున్నాడు. అయినప్పటికీ.. అరంగేట్రం మ్యాచ్‌లో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోగలిగాడు. అతని రన్నప్.. ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ ఆల్‌రౌండర్ బ్రెట్‌లీని తలపించింది. రనప్ తీసుకునే సమయంలో తన శరీరాన్ని కొద్దిగా విల్లులా ముందుకు వంచి, బలాన్ని కూడదీసుకోవడం బ్రెట్‌లీని తలపించినట్టయిందంటూ కామెంటేటర్లు సైతం వ్యాఖ్యానించారు. అదే వేగంతో బంతిని ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో సంధిస్తున్నాడనీ కితాబునిచ్చారు.

బెన్‌స్టోక్స్ కామెంట్స్..
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బ్రెట్‌లీ కూడా ఇదేరకంగా కామెంట్స్ చేసినప్పటికీ.. అందులో కొద్దిగా సెటైర్లు కనిపించాయి. ఇషాంత్ శర్మతో పోల్చాడు. కార్తిక్ త్యాగి.. బ్రెట్‌లీలా రన్నప్ ప్రారంభించినప్పటికీ.. ఇషాంత్ శర్మలా బంతిని సంధిస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడతను. కార్తీక్ త్యాగిని అతను పొగిడాడా? లేదా తిట్టాడా? అనేది అర్థం కాలేనంత ట్విస్ట్ ఇచ్చాడు ఈ సింగిల్ లైన్ పంచ్‌లో. బెన్‌స్టోక్స్ ట్విట్టర్ ఫాలోవర్ ఒకరు అదే అడిగాడు. అది కాంప్లిమెంటా? లేక నిందా? అని ప్రశ్నించాడు. దీనికి బెన్‌స్టోక్స్ వెంటనే రిప్లయ్ ఇచ్చాడు. తన అబ్జర్వేషన్ మాత్రమేనని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.

భారీ స్కోరుతో..
అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణ ఓటమిని చవి చూసింది. స్మిత్ సేనకు ఇది వరుసగా మూడో ఓటమి. దీనితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలతో జోరు మీద కనిపించిన రాజస్థాన్ జట్టు.. ఆ తరువాత పరాజయాల బాట పట్టింది. పరాజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో తన స్థాయికి తగ్గట్టుగా ఆడట్లేదు. సంజు శాంసన్ మరోసారి విఫలం అయ్యాడు. డకౌట్ అయ్యాడు. బెన్‌స్టోక్స్ జట్టుతో కలవడం ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.