మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లోకి సంజయ్
హైదరాబాద్: తెలంగాణ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. పరీక్షలు తక్కువగా చేస్తున్నప్పటికీ ఎక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా, మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కాగా, ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలోనే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలకు ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్‌లోని తన నివాసంలోనే హోంక్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
కాగా, సంజయ్ కుమార్ పలువురు ప్రముఖులను కలిసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కలిసిన వారికి కూడా కరోనా టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో తనను కలిసినవారు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. వారంతా హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి హరీశ్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ఇప్పటి వరకు 2,14,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
24,208 యాక్టివ్ కేసులున్నాయి. 1,89,351 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 1,233 మంది మరణించారు. తాజాగా, తెలంగాణలో 2275 కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. 2009 మంది కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 36 లక్షల పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications