APSRTC: గోవాకు స్పెషల్ బస్: టికెట్, రిజర్వేషన్ వివరాలు ఇవే
కడప: వేసవి సెలవుల్లో ప్రయాణికులను ఆకట్టుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ తరహాలోనే ప్రయాణికుల కోసం టూరిజం సర్వీసులను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ నడిపించని కొత్త రూట్లు, ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రాలకు బస్సులను నడిపిస్తోంది.
తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టింది. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇదివరకే అన్నమయ్య రాయచోటి జిల్లాలోని మదనపల్లి నుంచి ఊటీకి ఈ స్పెషల్ బస్సును ప్రవేశపెట్టింది.

దీనికి మంచి ఆదరణ లభించడంతో ప్రత్యేక బస్ సర్వీసుల సంఖ్యను పెంచే ప్రయత్నాలు ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. తాజాగా కడప నుంచి గోవాకు ప్రత్యేక బస్సును నడిపించనున్నారు. గతంలో గోవాకు ప్రత్యేకంగా బస్సులను నడిపించిన దాఖలాలు లేవు. ప్రయాణికుల నుంచి అందుతోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అరుణాచలం, వేలాంకిణి, ఊటీ, గోవా వంటి ఆధ్యాత్మక-పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెట్టారు.
కడప నుంచి గోవాకు ఇంద్ర ఏసీ బస్సును అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు కడప బస్ స్టేషన్ నుంచి ఈ బస్సు బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు గోవాకు చేరుకుంటుంది. అనంతపురం, బళ్లారి, బెళగావి మీదుగా ఈ బస్సు రాకపోకలు సాగిస్తుంది. ఇందులో ఛార్జీ పెద్దలకు 3,000 రూపాయలు, పిల్లలకు 2,250 రూపాయలుగా నిర్ధారించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications