వైఎస్ వివేకా హత్యకేసులో కొత్త ట్విస్ట్ .. వివేకా సోదరులు, టీడీపీ నాయకుల రహస్య విచారణ
గత ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికారులు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చే ఆరు నెలలైనా ఇప్పటివరకు కేసులో చెప్పుకోదగిన పురోగతి సాధించలేకపోయారు అధికారులు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరోమారు ఈ కేసుకు సంబంధించి వైయస్ వివేకానంద రెడ్డి సోదరులను రహస్యంగా విచారిస్తున్నారు సిట్ అధికారులు.

వై ఎస్ వివేకానంద రెడ్డి సోదరులను విచారించిన సిట్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప జిల్లాకు చెందిన పలువురు నాయకులను సిట్ అధికారులు విచారించినట్లు గా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయిన వైఎస్ భాస్కర్ రెడ్డిని, పులివెందుల పురపాలిక మాజీ కౌన్సిలర్ వైఎస్ మనోహర్ రెడ్డి ని సిట్ అధికారులు విచారించారు.
వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్ ... శ్రీనివాసుల రెడ్డి మృతి కేసు మిస్టరీతో లింక్

కడప పోలీస్ శిక్షణ కేంద్రంలో టీడీపీ నేతల విచారణ
అంతేకాకుండా కొమ్మ శివ రాఘవ రెడ్డిని, తెలుగుదేశం పార్టీకి చెందిన మరో వ్యక్తిని కూడా పోలీస్ శిక్షణ కేంద్రంలో పలు కోణాల్లో విచారించారు సిట్ అధికారులు . వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డిలతో పాటు కొందరు టీడీపీ నేతలను రహస్యంగా విచారిస్తున్న సిట్ అధికారులు ఈ మర్డర్ మిస్టరీని ఎప్పటి వరకు ఛేదిస్తారు అన్నది అంతుచిక్కడం లేదు. గత ఎన్నికలకు ముందు మార్చి 14వ తేదీన వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

టీడీపీ హయాంలో సిట్ ను తొలగించి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన సిట్
అప్పటినుండి ఇప్పటివరకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ హత్యపై అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ వేగవంతం చేయించాలనే ఉద్దేశంతో టిడిపి హయాంలో ఏర్పాటు అయిన సిట్ ను తొలగించి ఆ స్థానంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు .

ఇప్పటికే పలువురికి నార్కో అనాలిసిస్ పరీక్షలు
ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా ఉన్న పలువురికి నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. వీరిలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో సిట్ విచారణ కాస్త జాప్యం అయ్యింది. ఇక తాజాగా మరోమారు దర్యాప్తులో వేగం పెంచారు సిట్ అధికారులు. ఇక గత ఎన్నికల ముందు అత్యంత దారుణంగా హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీని త్వరితగతిన తేల్చకుంటే ప్రతిపక్ష పార్టీల నుండి ఏపీ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!