చంపుతామంటూ అధికార పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు బెదిరింపులు, కేసు నమోదు
అమరావతి/కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీకి చంపుతామంటూ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఊరి వదిలిపెట్టి వెళ్లపోమంటూ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు వచ్చిన ఈ బెదిరింపు ఫోన్స్ కాల్స్ కడప జిల్లాలో కలకలం రేపుతోంది.

చంపేస్తామంటూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు బెదిరింపులు
ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని ఆశించిన రమేష్ యాదవ్‌కు అప్పుడు కుల సమీకరణల్లో భాగంగా ఆ పదవి దక్కలేదు. అయితే, ఆ తర్వాత గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది వైసీపీ అధిష్టానం. ఇటీవలే రమేష్ యాదవ్ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. అయితే, తాజాగా, ఆయనకు చంపుతామంటూ బెదిరింపులు రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే రమేష్ యాదవ్‌కు ఇంటర్నెట్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చాయి. జూన్ 25వ తేదీన అర్ధరాత్రి 12.25 నిమిషాలకు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం వరకు చంపేస్తాం.. జాగ్రత్తగా ఉండు.. ఖబడ్దార్ అంటూ ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు ఆగంతకులు.

డీఎస్పీకి రమేష్ యాదవ్ ఫిర్యాదు.. సీఎం దృష్టికి..
ఈ క్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావును కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్ అన్ని వాట్సాప్ నుంచి చేయడంతో ట్రాక్ చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కాగా, బెదిరింపు కాల్స్ విషయాన్ని రమేష్ యాదవ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ అనుచరులు ఇలా.. ఖండించిన ఎమ్మెల్యే రాచమల్లు..
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి తన అనుచరులతో కాల్ చేయించి బెదిరింపులకు దిగారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు రాజకీయాల్లో రమేష్ యాదవ్ చురుగ్గా వ్యవహరిస్తుండటంతో దాన్ని రాచమల్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్సీ అనుచరులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ వివాదంపై స్పందించారు ఎమ్మెల్యే రాచమల్లు. రమేష్ యాదవ్‌తో తనకేలాంటి వైరం లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి స్పష్టం చేశారు. ఆయనతో రాజకీయంగా, వ్యాపార పరంగా వివాదాలేవీ లేవని రాచమల్లు చెప్పుకొచ్చారు. తనకు ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.

నందం సుబ్బయ్యను చంపినట్లే చంపుతామంటూ..
నందం సుబ్బయ్యను హత్య చేసినట్లే చంపుతామని బెదిరింపులకు పాల్పడటంతో ఎవరో తెలిసినవారే ఈ బెదిరింపులకు పాల్పడి ఉంటారని టీడీపీ నేతలంటున్నారు. సుబ్బయ్య హత్యకు, ఈ కాల్స్ చేసిన వారికి సంబంధం ఉండిఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు వేగంగా జరిపి బెదిరింపులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ అనుచరులు కోరుతున్నారు. రమేష్ యాదవ్ కాల్ డేటా సేకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని చంపుతామంటూ బెదిరించడం స్థానికంగా కలకలంగా మారింది. గత డిసెంబర్ 29న కొందరు దుండగులు టీడీపీ నేత సుబ్బయ్యను వేటకొడవళ్లతో నరికి చంపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై అప్పట్లో సుబ్బయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications