యాదాద్రి తరహాలో..! కొండగట్టులో ఆనంద్‌సాయి మకాం, రేపు కేసీఆర్
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆనంద్ సాయి సందర్శించారు.
కరీంనగర్: ఆగమశాస్త్రం ప్రకారమే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అధికారులు, అర్చకులతో చర్చించినట్లు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామ పరిధిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆనంద్ సాయి సందర్శించారు.
ఫిబ్రవరి 14న సీఎం కేసీఆర్ కొండగట్టుకు రానుండగా ఆనంద్ సాయి ఆదివారంనాడు ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని యాదాద్రి పుణ్యక్షేత్రం తరహాలో అభివృద్ధి చేయడానికి ఇటీవల ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆనంద్ సాయి కొండగట్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయానికి రెండో ప్రాకార మండపం, పుష్కరిణి, విద్యుత్, గదులు, నీటి విసతి, మెట్ల దారి వెంట భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తానని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని ఆనంద్ సాయి తెలిపారు. కాగా, ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ సాయి కొండగట్టు అభివృద్ధి నమూనాపై కేసీఆర్ కు వివరించనున్నారు.












Click it and Unblock the Notifications