గోబెల్స్ ప్రచారం: అబద్దాలు వల్లెవేయకు, ఈటలపై హరీశ్ ఫైర్
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్దం కంటిన్యూ అవుతోంది. ఈటల రాజేందర్ గోబెల్స్ ప్రచారాన్నే నమ్ముకున్నారని, అబద్ధాలతో గెలిచేందుకు యత్నిస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. హుజూరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మీటింగ్‌కి వెళ్లినా తాను మాట్లాడుతుంటే కావాలనే కరెంట్ కట్ చేస్తున్నారని, తనను వేధిస్తున్నారపి ఈటల రాజేందర్ ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ ఫంక్షన్ హాలులో ఈటల రాజేందర్ మీటింగ్ పెట్టుకుంటే మైకు మూగబోయిందని, దానికి టీఆర్ఎస్ వాళ్లు కరెంట్ కట్ చేశారని గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారులను ఆరాతీస్తే..అసలు ఆ ఫంక్షన్‌హాల్‌కు కరెంట్ కనెక్షన్ లేదని, బిల్లు కట్టకుంటే కట్‌చేశామని చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ సుమన్ కారు ఓ ఆటోడ్రైవర్‌ను ఢీ కొంది అని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ఈటల బ్యాచ్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేసిందన్నారు. మొదట సుమన్ కారు గుద్దిందని, తర్వాత సుమన్ సోదరుడి కారు అని, తర్వాత మరొకరంటూ పుకార్లు లేపారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కారును పట్టుకుంటే అసలు విషయం బయటపడిందన్నారు. ఆటోడ్రైవర్‌ను గుద్దింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సన్నిహితుడైన విశ్వనాథ్ ఆనంద్ కారు అని తేలిందన్నారు. దీనిపై ఈటల రాజేందర్ ఇప్పటివరకూ ఒక్క మాటల కూడా మాట్లాడలేదని హరీశ్‌రావు మండిపడ్డారు.

పత్తా లేకుండా పోయారు..
రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ. 291 పన్ను వేస్తోంది. దాన్ని తొలగించవచ్చు కదా అంటూ ఈటల రాజేందర్ ఓ సభలో మాట్లాడారని, దీనిపై చర్చకు రా అని సవాల్ విసిరితే పత్తా లేకుండా పోయాడని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏడేళ్లు మంత్రిగా చేసిన ఈటల రాజేందర్‌కు గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర పన్ను ఎంత ఉంటుందో తెలువదా? అని ప్రశ్నించారు. ఆయన హయాంలో జీఎస్టీ వచ్చిందని, దీనిపై ఆయనకే ఎక్కువ అవగాహన ఉండాలి కదా? అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈటల మాట్లాడింది కరెక్ట్ అని నిరూపిస్తే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరానని, రెండు రోజులైనా ఈటల సప్పుడు జేయడం లేదని ఎద్దేవా చేశారు. శంభునిపల్లిలో మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి ఫేక్ చెక్కులు ఇచ్చారని, ఈ నెల 30లోగా చెక్కులు క్లియర్ చేయాలని ఈటల రాజేందర్ మరో ఫేక్ ముచ్చట చెప్పారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఐదు మండలాల్లో రూ.25.89 కోట్లు ఇచ్చామని, బతుకమ్మ పండుగకు ముందు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నారు. మహిళలు కూడా డబ్బులు వచ్చాయని చెప్పారన్నారు.

ధర పెంచి వాత
టీఆర్ఎస్ సర్కారు పండుగపూట వడ్డీలేని రుణం ఇస్తుంటే.. బీజేపీ సర్కారు గ్యాస్ సిలిండర్ ధర పెంచిందని హరీశ్ రావు విమర్శించారు. ఈటల రాజేందర్ ప్రతిదానికీ బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని, దానికి విశ్వసనీయత ఉంటుందా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోషల్ మీడియా, కరపత్రాలతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, హుజూరాబాద్ ప్రజలు గమనించి తిప్పికొట్టాలని సూచించారు. ఉప ఎన్నికను ఏడేళ్ల బీజేపీ పాలన, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనకు రెఫరెండంగా తీసుకుందామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అబద్ధాలను నమ్మితే ఆగమవుతారని, ఆలోచించి అభివృద్ధికే పట్టంగట్టాలని కోరారు.

గెలుపెవరిదో..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించారు. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.

తప్పనిసరి..
హుజురాబాద్‌లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.

దళితబంధు
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.