గంటన్నరలో వరదనీటిని తరలిస్తాం: మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్‌లో ప్రతీ చోట నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభావితమైన కరీంనగర్ టౌన్, పరిసర లోతట్టు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పర్యటించారు. నడుము లోతు నీటితో నిండిన కాలనీల్లోనూ పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. పద్మనగర్, రేకుర్తి, రాంనగర్ తదితర ఏరియాల్లో రోడ్డు పనులు నడుస్తున్నందున నీరు నిలిచిపోయిందన్నారు.
శాతవాహన యూనివర్సిటీతో పాటు ఓపెన్ ఏరియాల్లో వరదను 394 కాలువలోకి మల్లించినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, అందరూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారన్నారు. మున్సిపల్ సిబ్బంది మొదలు, రెవెన్యూ, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖతో సహా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో ఇప్పటివరకూ ప్రాణనష్టం జరుగలేదని తెలిపారు. అక్కడక్కడ కొంత ఆస్తినష్టం జరిగిందన్నారు. గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోవడంతో వర్షాలు కురిసిన సమయంలో ఆ నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరిగేవన్నారు.

కాళేశ్వరంతో గత సీజన్ నుంచి అన్ని జలాశయాలు నిండుకుండలా మారి గ్రౌండ్ వాటర్ లెవల్ ఇప్పటికే పెరిగాయన్నారు. దీంతో చిన్న వర్షాలకే వరదలు వస్తున్నాయన్నారు. వీటిని ఎక్కడికక్కడ మానేరులోకి మల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మానేరు జలాశయం సైతం నిండి గేట్లు తెరుచుకున్నాయన్నారు. విపత్తులు చెప్పి రావు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల్ని సాధ్యమైనంత తర్వగా తొలగిస్తామని, ప్రజలు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగుతున్నాయి. వరదనీరు పోటెత్తడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణాల్లోని కాలనీలు, రోడ్లు నదుల మాదిరిగా మారిపోయాయి. వరద నీటి తరలింపు చర్యలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది.


Click it and Unblock the Notifications