మరికొన్ని గంటల్లో కౌంటింగ్.. హుజురాబాద్ బాద్ షా ఎవరు..?
హుజురాబాద్ బై పోల్ కౌంటింగ్ కాక రేపుతోంది. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 86.64 శాతం ఓట్లు పోలవడం ఉత్కంఠ రేపుతోంది. గతంలో ఉప ఎన్నికలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. కొన్ని గ్రామాల్లో 90 శాతంపైగా పోలింగ్ నమోదవడం విశేషం. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారాయి.రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ ఉపఎన్నిక ఫలితాలను ముడిపెట్టడంతో అంతా ఒక్కసారిగా హుజురాబాద్ వైపు చూడటం ప్రారంభించారు.

భారీ పోలింగ్..
అంతా అనుకున్నట్లుగానే భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. హుజూరాబాద్ (85.66%), వీణవంక (88.66%), జమ్మికుంట (83.66%), ఇల్లందకుంట(90.73%), కమలాపూర్ (87.57%) భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. నియోజకవర్గంలో పురుషులు 87.05శాతం ఓటు వేయగా.. మహిళలు 86.25శాతం ఓటేశారు. వాస్తవానికి నియోజకవర్గంలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిలిచారు. నియోజకవర్గంలో 2,36,873 మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

ముగ్గురి మధ్యే పోటీ
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. 30 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఈటల రాజేందర్ , బల్మూరి వెంకట్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. టీఆర్‌ఎస్-బీజేపీల మధ్య 'నువ్వా-నేనా' అనే స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి. సైలెంట్ ఓట్లపై ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది. ఇటు గులాబీనేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసుకుంటున్నారు.

మార్చే అవకాశం లేదు
హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చేందుకు అవకాశం లేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. .ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చడానికి ఎక్కడా అవకాశం లేదని, ఐఏఎస్, ఐపీఎస్‌లు కుమ్మక్కైయ్యారంటూ ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై సీసీ ఫుటేజీలతో సహా ఎన్నికల కమిషన్‌కు సమగ్ర నివేదిక పంపించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications