క్షుద్రపూజలతో రెండో భార్యను హత్య చేసేందుకు నిత్య పెళ్లికొడుకు ప్లాన్: చివరకు
ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో క్షుద్రపూజలు స్థానికంగా కలకలం రేపాయి. కట్టుకున్న భార్యను హతమార్చేందుకు ఓ దుర్మార్గుడు క్షుద్రపూజలు చేయించడం స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో ఆ నిత్య పెళ్లికొడుకును వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

నిత్య పెళ్లికొడుకు.. మొదటి భార్యను విడిచిపెట్టి..
ఈ నిత్య పెళ్లి కొడుకుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం శేఖరబంజరకు చెందిన కుమార్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం ఆమెను వదిలేసి గోపిక అనే యువతిని నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు.

మూడో భార్య కోసం రెండో భార్యను చంపేందుకు క్షుద్రపూజలు
రెండో భార్య వద్ద ఉన్న బంగారం, డబ్బు మొత్తం తీసేసుకున్నాడు. ఆమె వద్ద ధనం మొత్తం అయిపోయాక మరో మహిళను మూడో పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్నాడు. వీరి బంధానికి అడ్డుగా ఉన్న రెండో భార్య గోపికను అడ్డు తొలగించేందుకు కుట్రపన్నాడు. ఇందులో భాగంగా ఆమెను హతమార్చేందుకు క్షుద్రపూజలు చేయించాడు. దీన్ని గమనించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

నిత్య పెళ్లికొడుకును శిక్షించాలంటూ రెండో బార్య
తనకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ అమాయక మహిళలను మోసం చేస్తున్న ఈ నిత్య పెళ్లి కొడుకు భార్యను చంపించేదుకు క్షుద్రపూజలను ఆశ్రయించిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video

కాపురం చేయనన్నందుకు రెండో భార్యను హత్య చేశాడు
ఇది ఇలావుండగా, భర్తతో కాపురం చేయడం ఇష్టంలేదని చెప్పినందుకు అతని చేతిలో రెండో భార్య దారుణ ఘత్యకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లలో చోటు చేసుకుంది. ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట బానయ్యకు రెండో భార్యగా రేణుక(37) గత ఇరవై ఏళ్లుగా కాపురం చేస్తోంది. అయితే, భర్తతో ఉండటం ఇష్టం లేదని ఆమె గత నాలుగు నెలల క్రితం హైదరాబాద్ కు వెళ్లి కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా, తన తల్లి కనిపించడం లేదని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది రేణుక కుమార్తె. దీంతో రేణుక దంపతులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ బానయ్య తరచూ గొడవలు పెట్టుకోవడంతో రేణుక ఓ మాజీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించింది. శనివారం పెద్ద మనుషుల ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించారు. తన భార్య కాపురానికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బానయ్య పురుగులమందు తాగేందుకు ప్రయత్నించగా అక్కడివారు అడ్డకున్నారు. ఆ సమయంలోనే తన భర్తతో కాపురం చేయలేనంటూ తెగేసి చెప్పి రేణుక అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అయితే, రేణుకను వెంబడించిన బానయ్య.. ఆమె తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. రేణుక కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.