కుప్పంలో చంద్రబాబు నయా స్ట్రాటజీ - ఇక ఆపేదెవరు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలకు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షోలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబు - పోలీసుల మధ్య చాలాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో రోడ్ల మీద సభలకు అనుమతి నిరాకరించారు. కుప్పం పర్యటన వేళ రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. జీవోలు..పోలీసులు అడ్డుకోవటం పైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. కానీ, కుప్పంలో పర్యటించకుండా తిరిగి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహం సిద్దం చేసారు. కుప్పం నుంచే దీనిని అమలు చేస్తున్నారు.
కుప్పంలో రోజంతా ఉద్రిక్తత...
చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం కుప్పం చేరుకున్నారు. అప్పటికే టీడీపీ శ్రేణులు - పోలీసుల మధ్య పలు ప్రాంతాల్లో వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రచార వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సభా ప్రాంగణానికి అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 మేరకు రోడ్ షో లకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇక, చంద్రబాబు బెంగుళూరు వినామాశ్రయం నుంచి కుప్పం కు చేరుకొనే క్రమంలో శాంతిపురం మండలం 121 పెద్దూరు వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, చంద్రబాబు సహనం కోల్పోయారు. పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. జీవోలోని లోపాలను ప్రస్తావించారు. తనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కారణాలతో లిఖిత పూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేసారు.తన నియోజకవర్గంలో తననే తిరగనివ్వరా అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్యటన ఆపేది లేదని భీష్మించారు. చివరకు పోలీసు ఆంక్షలతో సభలు రద్దుచేసుకున్నారు. కానీ, మరో బాట ఎంచుకున్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి..
రోడ్ షో..బహిరంగ సభలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. చంద్రబాబును అడ్డుకోవటం పైన జనసేన అధినేత పవన్ తో సహా ప్రతిపక్ష నేతలు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయం పైన నిరసన వ్యక్తం చేసి.. ప్రతిపక్షాల మద్దతు సంపాదించిన చంద్రబాబు కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. కుప్పంలో సభలను రద్దు చేసుకున్నారు. ఇక, ముందుగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రాంతాల్లో పాదయాత్రకు డిసైడ్ అయ్యారు. ఒకే చోట రోడ్ షో కు పరిమితం కాకుండా ప్రతీ ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా శాంతిపురం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీని ద్వారా చంద్రబాబును అడ్డుకొనే అవకాశం ఉండదు. అదే సమయంలో.. చంద్రబాబు ప్రతీ ఇంటికి వెళ్లటం ద్వారా మరింతగా ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి ఆదరణ ఉంటుందనేది పార్టీ నేతల అంచనా. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లటం ద్వారా వచ్చే ఎన్నికలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లటం.. గ్రామాల్లో రచ్చబండ తరహాలో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రభుత్వం వర్సస్ చంద్రబాబు - ఎత్తులు పై ఎత్తులు
వచ్చే ఎన్నికలకు ఇప్పటికే ఏపీలో రాజకీయ టెన్షన్ మొదలైంది. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాటతో ప్రాణనష్టం జరిగింది. దీంతో, వెంటనే ప్రభుత్వం స్పందించింది. రాజకీయం గా చంద్రబాబును టార్గెట్ చేసింది. ప్రచారం కోసం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పాలనా పరంగా వైసీపీ ప్రభుత్వం ఈ తొక్కిసలాటల నియంత్రణ కోసం కొత్త జీవో తీసుకొచ్చింది. ఈ జీవో తరువాత చంద్రబాబు తొలి పర్యటన కుప్పం. అక్కడ పోలీసులు - టీడీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో అందరూ కుప్పం పైనే ఫోకస్ చేసారు. చంద్రబాబును అడ్డుకోవటంతో ఈ వ్యవహారం మరింతగా చర్చకు కారణమైంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికి నడిచి వెళ్లి..తన నియోజకవర్గ ప్రజలను కలవాలని నిర్ణయించటం ఈ వ్యవహారం లో కొత్త మలుపు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఇంటింటికీ వెళ్లటం ప్రారంభించటంతో మిగిలిన నేతలు ఇదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైనట్లుగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications