నిజమే -ఆ బంధం ప్రత్యేకం : కుప్పంలో పోటీపై తేల్చేసిన విశాల్...!!
ఏపీలో సీఎం జగన్ నినాదం వై నాట్ 175. కుప్పంలోనూ మనమే గెలవబోతున్నాం. కొంత కాలంగా ముఖ్యమంత్రి జగన్ తో సహా వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్న మాటలు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల దిశగా అభ్యర్ధులను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో హీరో విశాల్ కుప్పంతో తన అనుబంధం గురించి వివరించారు. రాజకీయాల్లోకి రావటం ఖాయమని చెప్పారు. కుప్పంలో పోటీపైన క్లారిటీ ఇచ్చారు.

చెన్నై ఎంతో కుప్పం కూడా అంతే
తాను సమాజ సేవ చేసేందుకు రాజకీయాల్లో అడుగు పెడతానని హీరో విశాల్ స్పష్టం చేసారు. కుప్పంతో తన అనుబంధాన్ని వివరించారు. తన తండ్రి గ్రానైట్ కంపెనీలో చేసే సమయంలో మూడేళ్ల పాటు కుప్పంలో ఉన్నానని గుర్తు చేసారు. కుప్పంలో 40 శాతం మంది తమిళ ప్రజలు ఉన్నారన్నారు. అక్కడి కార్మికులంతా బాగా తెలుసని విశాల్ చెప్పుకొచ్చారు. అక్కడ తెలియని వీధి లేదని చెప్పారు. కాట్పాడికి 22 కిలో మీటర్ల దూరంలో ఉందని వివరించారు. కుప్పంతో, ఆ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధం ప్రత్యేకమని వెల్లడించారు. తనకు చెన్నై ఎలాగో..కుప్పం అంతేనని స్పష్టం చేసారు. రాజకీయాలంటే సమాజ సేవ అని..తాను రాజకీయాల్లోకి రావటం ఖాయమని విశాల్ స్పష్టం చేసారు.

కుప్పం నుంచి పోటీపై క్లారిటీ..
కొంత కాలంగా విశాల్ కుప్పం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. వైసీపీ అభ్యర్ధిగా విశాల్ బరిలోకి దిగుతారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని దెబ్బ తీసిన వైసీపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. అక్కడ ఇప్పటికే భరత్ ను వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. గతంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నుంచి భరత్ వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉంటారని స్పష్టం చేసారు. అయినా..విశాల్ పోటీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక, ఇప్పుడు విశాల్ తేల్చి చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చేది వాస్తవమే అయినా.. కుప్పంతో అనుబంధం ఉన్నదీ నిజమేనని..కానీ, తాను కుప్పం నుంచి పోటీ చేయటం లేదని విశాల్ తేల్చి చెప్పారు. జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు.

చంద్రబాబు వర్సస్ చంద్రమౌళి కుమారుడు
కుప్పంలో 2014, 2019 ఎన్నికల్లో చంద్రమౌళి వైసీపీ నుంచి పోటీ చేసారు. ఇప్పుడు కుప్పంలో ఆయన కుమారుడు భరత్ వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. భరత్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవితో పాటుగా కుప్పం సీటు ఖరారు చేసారు. ఇప్పటికే భరత్ క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. గడపగడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుప్పం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. కుప్పంలో ఈ సారి గెలుపు ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు గతం కంటే భిన్నంగా ప్రతీ ఆరు నెలలకోసారి కుప్పంలో మూడు రోజుల పాటు మకాం వేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వైసీపీ కుప్పం పైన ఈ సారి ఫోకస్ పెట్టటంతో చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. దీంతో, రానున్న ఎన్నికల్లో కుప్పం రాజకీయం ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications