coronavirus:హోం క్వారంటైన్‌లోకి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ఇటీవల రెడ్‌జోన్ ఏరియాలో..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. 512 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరితో కలిసి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది. కర్నూలులో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వంద దాటింది.

హై అలర్ట్..
కర్నూలులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో ఏపీ సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది. కర్నూలులో 126 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. గుంటూరులో కూడా ఇదే మొత్తంలో కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఇటీవల స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రెడ్ జోన్ ప్రాంతాల్లో పర్యటించారు. దీంతో అతనిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు స్పష్టంచేశారు.

నెగిటివ్.. కానీ...
ఎమ్మెల్యే రెడ్ జోన్ ఏరియాలో పర్యటించడంతో వైరస్ లక్షణాలు ఉన్నాయా అనే సందేహంతో పరీక్ష కూడా చేయించుకున్నారు. అయితే నెగిటివ్ వచ్చింది. కానీ హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు సూచించారు. అధికారుల సూచనమేరకు ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్న నెగిటివ్ వచ్చిందని.. కానీ అధికారుల సూచనమేరకు క్వారంటైన్‌లో ఉన్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

126 మందికి
ఢిల్లీ వెళ్లొచ్చిన వారి నుంచి కర్నూలు జిల్లాలో వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. వైరస్ సోకి ఈ నెల 15వ తేదీ వరకు నలుగురు చనిపోయారు. 126 మందికి చికిత్స అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇంటినుంచి బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను కూడా తామే అందజేస్తామని తెలియజేశారు. వైరస్ వేగంగా ప్రబలుతోన్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications