వచ్చే ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోండి: కేసీఆర్ సర్కారుపై ప్రియాంక ఘాటు విమర్శలు
నల్గొండ: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలకు ఐదేళ్లు ఎలాంటి పాలన కావాలో ఎన్నుకునే సమయం వచ్చిందన్నారు.
రాజస్థాన్, కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఎలా గ్యారంటీలను అమలు చేశామో.. తెలంగాణలోనూ అలాగే అమలు చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఇది ఎన్నికల సమయమని.. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదని.. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆలోచనలేదని విమర్శించారు. దేశంలో నోట్ల రద్దు, కరోనావైరస్, జీఎస్టీ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీలకు ఎలాంటి సహాయ చేయలేదని ప్రియాంక వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతకు రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. పేపర్లు లీక్ చేసి యువత జీవితాలను నాశనం చేశారని ప్రియాంక విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ బాగుంటుందని యువత పోరాడితే వారి జీవితం అంధకారమైందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ పాలనలో కిందస్థాయి మొదలుకుని పై స్థాయి వరకు అంతా అవినీతిమయమని ప్రియాంక ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాత్రమే ధనవంతులయ్యారని.. పేదల జీవితాలు ఏమీ మారలేదన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ప్రియాంక ఇచ్చారు.
భువనగిరి ఎన్నికల ప్రచారం అనంతరం ప్రియాంక గాంధీ గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ పాలిస్తోంది.. కానీ ప్రజల కోసం ఏం చేసిందో అందరూ ఒకసారి ఆలోచించాలని సూచించారు. తెలంగాణ వస్తే అందరు తమ కలలు నెరవేరతాయని భావించారని.. కానీ ఇప్పుడు అది కలగానే ఉందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.












Click it and Unblock the Notifications