ఆ పార్టీకి డిపాజిట్ వచ్చినా.. నన్ను పక్కకు జరిపేస్తరు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నల్గొండ: మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లు ఏదో ఒకదానికి ఆశపడి ఓటు వేయవద్దని అన్నారు సీఎం కేసీఆర్. చండూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మునుగోడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 40ఏళ్ల కిందట పొరపాటుతో గోసపడ్డామని.. సుదీర్ఘంగా పోరాడి.. వేలాది మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. తాను కూడా చావుదాకా పోయివచ్చినట్లు తెలిపారు.

ఆ పార్టీకి డిపాజిట్ వచ్చినా.. నన్ను పక్కకు జరిపేస్తరు: కేసీఆర్
మునుగోడు ఉపఎన్నికలో జాగ్రత్తగా ఓటువేయాలన్నారు. తన బల ప్రజలేనని అన్నారు కేసీఆర్. ప్రజలు సహకరించకపోతే ఏం చేయగలమని ప్రశ్నించారు. బీజేపీకి డిపాజిట్ వచ్చినా.. నన్ను పక్కన జరిపేస్తరు. వందకోట్లతో ఎమ్మెల్యేలను కొనమని బ్రోకర్లను పంపిండ్రు. తెలంగాణను కబ్జా పెట్టి ప్రైవేటీకరణ చేస్తరు అని కేంద్రంపై కేసీఆర్ ఆరోపణలు చేశారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలని కేంద్రం చూస్తోందన్నారు.

ఆ పరిస్థితి చూసి ఏడ్చానంటూ కేసీఆర్
మునుగోడులో నీళ్ల గోస తమ ప్రభుత్వం వచ్చేవరకూ కూడా తీరలేదన్నారు కేసీఆర్. వాజపేయి సర్కారు కూడా అప్పుడు స్పందించలేదన్నారు. చూడు చూడు నల్లగొండ.. గుండెనిండ ఫ్లోరైడ్ మంట అనే పాటను తానే రాసినట్లు చెప్పారు కేసీఆర్. ఆ పరిస్థితులను చూసి ఏడ్చినట్లు తెలిపారు. నరకం చూపించే జెండాలు వస్తున్నాయన్నారు. ప్రజలు మోసపోయినంత కాలం మోసగాళ్ల ఆటలు సాగుతాయన్నారు. ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను కేసీఆర్ కోరారు.

దేశం కోసం బీఆర్ఎస్.. మునుగోడు చరిత్ర లిఖించాలన్న కేసీఆర్
కేంద్రం అనుసరిస్తున్న బ్యాడ్ పాలసీ కారణంగానే.. దేశం కోసం బీఆర్ఎస్ వస్తోందని కేసీఆర్ చెప్పారు. వామపక్షాలు కలిసిరావాలన్నారు. దేశంలో మునుగోడు ఫలితం చరిత్ర లిఖించాలన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్నారు. కేంద్రం వల్లే పలు ప్రాజెక్టులు ఆగిపోయాయని ఆరోపించారు కేసీఆర్. మోడీకి 8 ఏళ్లు చాలలేదా? నీళ్లు ఇవ్వడానికి అని ప్రశ్నించారు. తాను ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని అన్నారు.

గెలిచిన 15 రోజుల్లోనే.. మునుగోడుకు కేసీఆర్ హామీలు
ఇక్కడ 100 పండకల ఆస్పత్రి నిర్మిస్తానని చెప్పారు కేసీఆర్. చండూరు డివిజన్ చేయడం పెద్ద పనేం కాదన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన 15 రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోతాయన్నారు కేసీఆర్. మునుగోడులో నియోజకవర్గంలో రోడ్లన్ని బాగుపడతాయన్నారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు కేసీఆర్. గత ఎన్నికల్లో గెలిపించిన వ్యక్తి పత్తాలేరని.. ప్రభాకర్ రెడ్డి మాత్రం ప్రజల్లోనే ఉన్నారని కేసీఆర్ చెప్పారు. అందుకే కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు కేసీఆర్.