మళ్లీ నరసాపురానికి రఘురామ-మోడీ రాక సందర్భంగా- భద్రత కోసం కేంద్రానికి లేఖ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి తిరిగి రానున్నారు. రెండున్నరేళ్ల విరామం తర్వాత నరసాపురానికి వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నరసాపురానికి వస్తే వైసీపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని భావించి ఇన్నాళ్లూ ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం అవుతున్న రఘురామ.. ఈసారి ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ప్లాన్ చేసుకున్నారు.
రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా కేసులు పెట్టారు. వీటిపై విచారణ కోసం తనను అరెస్టు చేస్తారని భావించిన రఘురామ.. ఢిల్లీ వెళ్లిపోయారు. మధ్యలో ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చినా తిరిగి ఢిల్లీ వెళ్లిపోతున్నారు. ఈ మధ్యలో ఆయన్ను రాజద్రోహం కేసు కింద అరెస్టు చేసిన వైసీపీ సర్కార్ గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చింది. అనంతరం కోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చేరిన రఘురామ.. అనంతరం డిశ్చార్జ్ కాగానే ఢిల్లీ వెళ్లిపోయారు.

ఇప్పుడు జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ వస్తున్నారు. ఆయన టూర్ కు ముందే జూలై 2న రఘురామ నరసాపురం వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జూలై 2న వచ్చే రఘురామ 3, 4 తేదీల్లో కూడా నరసాపురంలోనే ఉండబోతున్నారు. దీంతో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు. రఘురామ కోరిన భద్రత లభిస్తే ఆయన నరసాపురం వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే వైసీపీ సర్కార్ పై దాడి తీవ్రత తగ్గించిన రఘురామపై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications