చంద్రబాబుకు కీలక సూచన చేసిన వైసీపీ మాజీమంత్రి
నెల్లూరు: నడిరోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై చెలరేగిన రాజకీయ దుమారం సద్దుమణగట్లేదు. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నాయకుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూనే వస్తోంది. టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏకంగా 11 మంది మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది.

ఆ రెండు ఘటనలతో..
కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ జీవోను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దాన్ని అణచివేయడానికే జగన్ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందంటూ ఆరోపిస్తోన్నాయి. ఇదే నెలలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ చేపట్టదలిచిన పాదయాత్రతో పాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించతలపెట్టిన వారాహి బస్సు యాత్రను అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారనే విమర్శలు షురూ అయ్యాయి.

మాజీమంత్రి ఫైర్..
ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిప్పికొట్టారు. ప్రజల భద్రత కోసం తీసుకొచ్చిన జీవోను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. ఈ జీవో తమ పార్టీకి కూడా వర్తిస్తుందని, ఎవరికి ఎలాంటి మినహాయింపు లేవని అన్నారు. ఇది ఏ ఒక్క పార్టీని దృష్టిలో పెట్టుకునో లేకపోతే ప్రజాస్వామ్య హక్కులను అణచివేయాలనే ఉద్దేశంతోనో జారీ చేసింది కాదని తేల్చి చెప్పారు. అన్ని పార్టీలు దీన్ని అనుసరించాల్సిందేనని చెప్పారు. తాము కూడా మీటింగులు పెట్టుకోవాలంటే ఈ జీవోకు లోబడాల్సి ఉండాలని పేర్కొన్నారు.

కనీసం వాయిదా కూడా వేసుకోలేదు..
కందుకూరులో ఎనిమిది మంది మరణించిన తరువాత కనీసం తన ఆందోళనను చంద్రబాబు నాయుడు వాయిదా కూడా వేసుకోలేదని, దీన్ని బట్టి ప్రజలను ఆయన ఎంత చులకనగా, చిన్నచూపుగా చూస్తారనేది అర్థమౌతోందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టుకుని తన సభలకు లక్షలాది మంది జనం వచ్చారని చంద్రబాబు చెప్పుకొంటోన్నారని, తామేమీ బహిరంగ ప్రదేశాలు, గ్రౌండ్స్ లల్లో సభలు, సమావేశాలను పెట్టుకోవద్దని చెప్పలేదుగా అని వ్యాఖ్యానించారు.

గ్రౌండ్స్ లల్లో పెట్టుకుని సత్తా చూపండి..
గ్రౌండ్స్ లల్లో మీటింగులు పెట్టుకుని సత్తా చూపాలని, ఎవరొద్దన్నారని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. కందుకూరు అంటే పొరపాటు అనుకోవచ్చు.. గుంటూరు సభలో కూడా ముగ్గురు చనిపోవడం ఏమిటని నిలదీశారు. చంద్రబాబు ఎక్కడ పాదం పెడితే అక్కడ ప్రజలు బలి అవుతున్నారని విమర్శించారు. నెల్లూరు నర్తకి సెంటర్ లో ఎప్పుడు చూసినా వెయ్యిమంది జనాలు ఉంటారని, అలాంటి చోట సభలు పెట్టుకుని తనకు తండోప తండాలుగా జనం వచ్చారని చెప్పుకొంటు అర్థం లేదని అన్నారు.

చంద్రబాబుకు టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్..
చంద్రబాబు ఏదో మీటింగులు, ఆందోళనలు అంటూ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడని, టైమ్ వేస్ట్, డబ్బులు వేస్ట్ అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఎలాగూ గెలిచేది లేదు కాబట్టి- ఈ మీటింగులు పెట్టడాన్ని మానుకుంటే కనీసం ఖర్చులైనా మిగులుతాయని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనని, తెలుగుదేశానికి కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. తన సూచన మేరకు ఈ పర్యటనలను మానుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications