వైఎస్ జగన్, వైసీపీ ఎంపీలపై నారా లోకేష్ చెప్పిన పిల్లుల కథ: మోడీని చూస్తే టేబుల్ కిందికి
నెల్లూరు: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ఒక్కొక్కరిగా ప్రచార బరిలో దిగుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ-జనసేన కూటమి మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. వైసీపీ తరఫున మంత్రులు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచార బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ విస్తృతంగా పర్యటిస్తోన్నారు.
జగన్ సర్కార్ అనూహ్యం: మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావం: శ్రీలక్ష్మి
పిల్లులతో పోల్చుతూ..
నెల్లూరు జిల్లా సర్వేపల్లి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రెండూ తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చేవే. ఎన్నికల ప్రచారంలో ఆయన అధికార పార్టీ నేతలపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులను పిల్లులతో పోల్చారు. మరో పిల్లి (తిరుపతి లోక్‌సభ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి)ని ఢిల్లీకి పంపించవద్దంటూ నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలతో చెలరేగిపోయారు.

మోడీని చూస్తే.. టేబుల్ కిందికి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఓ పెద్ద పిల్లి ఉందని, ఢిల్లీలో 28 చిన్న పిల్లులు ఉన్నాయని అన్నారు. అందులో 22 పిల్లులు లోక్‌సభలో, ఆరు రాజ్యసభలో కూర్చుంటాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూడగానే ఆ పిల్లులన్నీ టేబుల్ కింద దాక్కుంటాయని ఎద్దేవా చేశారు. మియావ్.. మియావ్ అంటూ ఆయన కంటికి కనిపించకుండా పారిపోతాయని చురకలు అంటించారు. నరేంద్ర మోడీని చూస్తే.. ఏపీలోని పెద్ద పిల్లి ఉచ్చ పోసుకుంటుందనీ ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో మరో తిరుపతి నుంచి మరో పిల్లిని పంపించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లునయినా వాళ్లు సమర్థిస్తారని విమర్శించారు.

మరో పిల్లి ఎందుకు
తిరుపతి నుంచి మరో పిల్లిని ఢిల్లీకి పంపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని నారా లోకేష్ విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రం మెడలు వంచి సాధిస్తామని వైసీపీ నేతలు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. అలాంటి పార్టీ పతనానికి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నుంచే శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ అన్నారు.

చంద్రబాబు సైతం
కాగా- తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు. గురువారం నుంచి ఆయన తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు విస్తృతంగా పర్యటిస్తారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరుల్లో చంద్రబాబు బహిరంగ సభలను నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ నేతలు ఆయనతో ఉంటారు.