కవ్వింపులతో ట్రాప్.. నగ్నంగా వీడియో కాల్స్.. లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్, యువకుడి ఆత్మహత్య..
ఇటీవలి కాలంలో వాట్సాప్ వీడియో కాల్స్‌తో యువకులను ట్రాప్ చేసి వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు చాలానే వెలుగుచూశాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ ట్రాప్‌లో చిక్కుకుని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నగ్న వీడియోలు లీక్ చేస్తామంటూ ఆ ముఠా బెదిరింపులకు పాల్పడటంతో పరువు పోతుందని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగింది...
నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు(22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కొద్దిరోజుల క్రితం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. 'నేను ఒంటరి మహిళను. మీతో చాట్ చేయాలనుకుంటున్నాను.' అని అందులో రాసి ఉంది. అప్పటినుంచి ఆ యువకుడు ఆ నంబర్‌కు మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టాడు. అవతలివైపు ఓ యువతి అతన్ని కవ్విస్తూ మాట్లాడింది.

కవ్వింపులతో ట్రాప్...
కొద్దిరోజులకు ఆ యువతి వాట్సాప్ వీడియో కాల్స్ చేయడం మొదలుపెట్టింది. అది కూడా నగ్నంగా... అంతేకాదు,నిన్నూ నగ్నంగా చూడాలనుందని అతన్ని కవ్వించింది. దీంతో ఆ యువకుడు కూడా నగ్నంగా ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడాడు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అతను నగ్నంగా మాట్లాడిన దృశ్యాలను రికార్డు చేసిన ఆ యువతి... అతన్ని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసింది. ఆపై ఆమె వెనకాల ఉన్న ముఠా కూడా అతన్ని బెదిరించడం మొదలుపెట్టింది.

బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆత్మహత్య...
బ్లాక్‌మెయిల్స్,బెదిరింపులకు భయపడిపోయిన ఆ యువకుడు తనవద్ద ఉన్న రూ.24వేలు వారి ఖాతాకు బదిలీ చేశాడు. అయినప్పటికీ వేధింపులకు తెరపడలేదు. డబ్బుల కోసం రోజూ ఫోన్ చేసి బెదిరించారు. డబ్బులు ఇవ్వని పక్షంలో నగ్న వీడియోలు యూట్యూబ్‌లో లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితం స్వగ్రామం వెళ్లిన యువకుడు... మంగళవారం(మార్చి 30) తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications