కీలక నియోజకవర్గంలో అభ్యర్దిని ప్రకటించిన సీఎం జగన్ - గెలవాల్సిందే..!!
వచ్చే ఎన్నికల్లో 175 సీట్ల టార్గెట్ తో అడుగులు వేస్తున్న సీఎం జగన్ అభ్యర్ధుల ఎంపిక ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగిస్తున్న ముఖ్యమంత్రి ..ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి అభ్యర్ధిని ఖరారు చేసారు. నియోజకవర్గంలో పార్టీలో సమస్యలపైన సీఎం కీలక సూచనలు చేసారు. అద్దంకి నియోజకవర్గం తనకు ప్రతిష్ఠాత్మకమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గాన్ని తాను ప్రత్యేకంగా చూస్తానని చెప్పారు. అక్కడ అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని సూచించారు.

అద్దంకి అభ్యర్ధి ఖరారు
వచ్చే ఎన్నికల్లో అద్దంకి వైసీపీ అభ్యర్ధిగా బాచిన కృష్ణ చైతన్యగా సీఎం జగన్ స్పష్టం చేసారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కృష్ణ చైతన్యకు మద్దతుగా నిలవాలని నిర్దేశించారు. ఎవరికైనా అభ్యంతరాలు..విభేదాలు ఉంటే తనను కలవాలని సూచించారు. మూడేళ్లలో అద్దంకి నియోజకవర్గంలో 93,124 కుటుంబాలకు రూ 1,081 కోట్లు ఇచ్చామని సీఎం వివరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తల నుంచి వారి అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అడుగుతున్నారని కార్యకర్తలు సీఎం తో చెప్పారు. గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధిని సీఎం చెప్పుకొచ్చారు.

గెలుపు ప్రతిష్ఠాత్మకమంటూ
ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ నాలుగు స్థానాలు గెలిచింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గొట్టిపాటి రవి కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బాచిన చెంచు గరటయ్య పోటీ చేసి గొట్టిపాటి రవి కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ వైసీపీ నుంచి కృష్ణ చైతన్యను ఎంపిక చేయటం..అద్దంకి పైన సీఎం చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు నియోజకవర్గంలో చర్చ మొదలైంది. అదే సమయంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్ ను ఓడించాలనే లక్ష్యం కనిపిస్తోంది. అద్దంకి నుంచి గతంలో కరణం బలరాం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పని చేసారు.

ప్రకాశం జిల్లాపై ఫోకస్
పార్టీ సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాంకు ఈ నియోజకవర్గంలో పట్టు ఉంది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రవి కుమార్ ఆ ఎన్నికల్లో బలరాం పైన గెలుపొందారు. 2019 నుంచి చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బలరాం గెలుపొంది..ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని సీఎం స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అద్దంకి అభ్యర్ది పైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.