ప్రకాశం టీడీపీ ఆధిపత్య పోరు- వైసీపీలో చేరేందుకు ఇద్దరు ఎమ్మెల్యేల ప్రయత్నం- చివరికి ఏం జరిగిందంటే...
ప్రకాశం జిల్లా రాజకీయాలు తలపండిన వారికి సైతం ఓ పట్టాన అర్ధం కావు. ఎవరు ఏ పార్టీలో ఎందుకు ఉంటారో, ఎందుకు తిరిగి ఇతర పార్టీల్లోకి ఫిరాయిస్తారో, మళ్లీ రాష్ట్రంలో అధికారం మారాక తిరిగి మళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వస్తారో తెలియని పరిస్ధితి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవి కుమార్ వైసీపీలోకి ఫిరాయించేందుకు చేసిన ప్రయత్నాలకు చివరి నిమిషంలో జరిగిన మార్పులతో ఒకరికి మోదం, మరొకరికి ఖేదం మిగిలింది. దీంతో ఇప్పుడు ప్రకాశం రాజకీయాల్లో తాజా పరిణామాలకు కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

ప్రకాశంలో వర్గపోరు...
ప్రకాశం జిల్లా రాజకీయాలన్నీ గ్రానైట్ క్వారీల చుట్టూ, పొగాకు, పత్తి వ్యాపారం చుట్టూ తిరుగుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు తమ ప్రత్యర్ధుల వ్యాపారాలను దెబ్బతీసేందుకు వారిని తమ కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దీంతో అక్కడ పార్టీల కంటే వర్గాల ఆధారంగానే రాజకీయం నడుస్తుంటుంది. ఇందులో ఎవరూ మినహాయింపు కాదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి గతంలో వైఎస్ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు . అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ఆయన్ను శాసనసభ నుంచి ఆరునెలల పాటు సస్పెండ్ కూడా చేసింది. అయినా ఆయన చలించలేదు. కానీ తాజాగా ఆయన అదే టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించారు.

కరణం వర్సెస్ గొట్టిపాటి
గతంలో ప్రకాశం జిల్లా మార్టూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొట్టిపాటి నర్సయ్య కుమారుడైన గొట్టిపాటి రవి కుమార్ 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో అద్దంకికి మారారు. అద్దంకిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి భరత్ కు అదే నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న కరణం బలరామ్ కూ మధ్య పోరుకు చాలా చరిత్రే ఉంది. కానీ కాంగ్రెస్ కనుమరుగై వైసీపీ ఆవిర్భవించాక 2014లోనూ అద్దంకి నుంచి గొట్టిపాటి రవి గెలుపొందారు. అయితే అప్పటికే తనకు ప్రత్యర్ధిగా ఉన్న కరణం బలరాం వరుస ఓటములతో నియోజకవర్గంలో ప్రాభవం కోల్పోయారు. దీంతో చంద్రబాబు కరణం బలరాం ఉండగానే అద్దంకిలో ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య పోరు తారాస్ధాయికి చేరింది.

2019 ఎన్నికల్లో కీలక మలుపు
2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడంతో అదే నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కరణం బలరాంతో నిత్యం తగాదాలు కొనసాగేవి. చంద్రబాబు సమక్షంలోనే ఇరు వర్గాలు వాదులాడుకున్న సందర్భాలు అనేకం. అయితే 2019 ఎన్నికలకు ముందు చీరాల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి ఫిరాయించడంతో అక్కడ టీడీపీ ఇన్ ఛార్జ్ అవసరం ఏర్పడింది. దీంతో చంద్రబాబు బలరాంను హుటాహుటిన అక్కడికి పంపి ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో టీడీపీలో కరణం వర్సెస్ గొట్టిపాటి వర్గపోరుకు తాత్కాలిక బ్రేక్ పడినట్లయింది. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ వైసీపీ గాలిని అడ్డుకుని మరీ చీరాల, అద్దంకి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ వర్గపోరు మాత్రం సమసిపోలేదు.

వైసీపీ అధికారం చేపట్టాక...
వైసీపీ అధికారంలోకి వచ్చాక గతంలో తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన గొట్టిపాటి రవితో పాటు చీరాల ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంను కూడా టార్గెట్ చేశారు. దీంతో వీరిద్దరూ స్ధానిక ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కరణం బలరాంను వైసీపీలోకి తీసుకునేందుకు సిద్దమైన జగన్.. గొట్టిపాటి విషయంలో మాత్రం నో చెప్పేశారు. గతంలో తమ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో ఫిరాయించిన గొట్టిపాటి ఇప్పుడు తన అవసరాల కోసం వైసీపీలోకి వస్తానంటే ఎలా తీసుకుంటామనే జగన్ ప్రశ్నకు పార్టీ నేతల వద్ద సమాధానం లేదు. దీంతో గొట్టిపాటి టీడీపీలోనే ఉండిపోగా.. కరణం మాత్రం వైసీపీలోకి తన వర్గాన్ని ఫిరాయించి తాను మాత్రం ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications