MP Magunta: లిక్కర్ స్కాంలో ప్రమేయం - ఎంపీ మాగుంట నెక్స్ట్ స్టెప్..!!
MP Magunta on Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తన పేరు ప్రస్తావించటం పైన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి స్పందించారు. తాజాగా, ఈడీ దాఖలు చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితతో పాటుగా వైసీపీ ఎంపీ మాగుంట పేరు ప్రస్తావించారు. ఆప్ నేతలకు లిక్కర్ స్కాంలో భాగంగా వంద కోట్లు ముడుపులను అందించినట్లుగా పేర్కొన్న పేర్లలో మాగుంట గురించి వివరించారు. అదే విధంగా మాగుంట కుమారుడుకు రెండు రిటైల్ జోన్లు దక్కినట్లుగా వివరించారు. దీని పైన స్పందించిన ఎంపీ మాగుంట ఏం జరిగిందనేది స్పష్టత ఇచ్చారు.

ఈడీ రిమాండ్ రిపోర్టు - మాగుంట స్పందన..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో చాలా రోజులుగా వైసీపీ ఎంపీ మాగుంట పేరు చర్చల్లో నిలిచింది. ఇప్పుడు మనీశ్ సిసోడియా సంబంధీకుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ ప్రస్తావించిన అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలానికి కారణమవుతున్నాయి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదన్నారు. దీని పైన మాగుంట స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇదంతా సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా వ్యాపారులు చేస్తున్న కుట్ర అంటూ అభిప్రాయపడ్డారు. వంద కోట్ల మేరు వసూలు చేసారనే ఆరోపణలను ఆయన ఖండించారు. తనకే కాదని..తన కుమారుడికి ఈ వ్యవహారంలో ఎటువంటి ప్రత్యక్ష - పరోక్ష పాత్ర లేదని మాగుంట క్లారిటీ ఇచ్చారు.

సోదాలు జరిగాయి.. అక్రమాలు లేవు
గతంలోనే దీనికి సంబంధించి తాను వెల్లడించిన అంశాలను గుర్తు చేసారు. దీని పైన ఏరకంగా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తున్నామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పై విచారణ ప్రారంభమైన సమయం నుంచి మాగుంట పేరు వినిపిస్తోంది. ఢిల్లీ..నెల్లూరు..చెన్నైలోని ఆయన కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసారు. అయితే, సోదాలు జరిగినా.. ఎటువంటి అక్రమాలు గుర్తించలేదని మాగుంట వివరించారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారంలో ఉందని గుర్తు చేసారు. తమ ఇంటి పేరుతోనే మరి కొంత మంది ఇదే వ్యాపారంలో ఉన్నారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత సెప్టెంబర్ లో తన సంస్థల్లో సోదాల సమయంలోనూ మాగుంట ఈ అంశాలను చెప్పుకొచ్చారు. తమ సంస్థల్లో ఎటువంటి అక్రమాలు గుర్తించలేదనే విషయాన్ని సోదాల తరువాత ఈడీ అధికారులు వెల్లడించారని వివరించారు.

ఎవరితోనూ లావాదేవీలు లేవు...
తమకు వచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ అధికారులు సోదీలు చేసారని మాగుంట చెప్పుకొచ్చారు. తన కుమారుడు పేరు రావటం పైనా ఆయన వివరణ ఇచ్చారు. అసలు ఈ వ్యవహారంతో తమకు ఎవరికీ సంబంధాలు లేవన్నారు. తాను వ్యాపారాల కోసం ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రిని కలవలేదని స్పష్టం చేసారు. ఈడీ జరుపుతున్నది వ్యాపారపరమైన దాడులుగానే భావిస్తున్నామని గతంలో మాగుంట స్పష్టం చేసారు. ఇక, ఇప్పుడు రిమాండ్ రిపోర్టులో ఆయన పేరు ప్రస్తావనతో న్యాయ పరంగా ముందుకెళ్లే అంశాల పైన మాగుంట చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో తన కుమారుడికి రిటైల్ జోన్లు దక్కాయనే అంశంలోనూ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం పైన కసరత్తు చేస్తున్నారు.