రూ 10 కోట్లతో అమ్మకు ఆలయం - తల్లిపై కుమారుడి ప్రేమ...!!
అమ్మకు ప్రేమతో ఒక కుమారుడు ఏకంగా ఆలయం నిర్మిస్తున్నారు. తన తల్లి తమ నుంచి దూరమైనా అమె గ్నాపకాలు కలకాలం గుర్తుండేలా గుడి నిర్మాణం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని చీమల వలస గ్రామంలో రూ 10 కోట్లతో ఈ గుడి నిర్మిస్తున్నారు. ఇందుకోసం కృష్ణ శిలను వాడుతున్నారు. ప్రత్యేకంగా శిల్పకళాకారులతో ఈ నిర్మాణం కొనసాగిస్తున్నారు. మాతృ దినోత్సవం నాడు ఈ గుడి నిర్మాణం అంశం వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు అమ్మకు ఆలయం ఆసక్తిగా మారుతోంది. సనపల శ్రావణ్ కుమార్ తల్లితండ్రులు క్రిష్ణావు, అనసూయా దేవి. ప్రస్తుతం శ్రావణ్ కుమార్ హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నారు. 2008 లో ఆయన తల్లి కన్నుమూసారు. దీంతో తల్లికి గుర్తుగా తన స్వగ్రామం చీమలవలసలో రూ 10 కోట్లతో 2019 మార్చిలో గుడి నిర్మాణం ప్రారంభించారు. ఇందుకోసం కృష్ణ శిలను మాత్రమే వాడుతున్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి ఆలయ నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పాకారుల ఆధ్వర్యంలో గుడి నిర్మిస్తున్నారు.

ఈ ఆలయంలో ప్రధాన గోపురం ఎత్తు 51 అడుగులు ఉండటంతో పాటు పంచగోపురాలను నిర్మిస్తున్నారు. మూలవిరాట్టుగా మాతృమూర్తి విగ్రహాన్ని, శిలలపై ప్రాచీన నగిషీలతో కట్టడాలు చేపట్టారు. అమ్మ ప్రేమ గొప్పతనంపై చిత్రాలను ఆలయం మండప స్తంభాలపై చెక్కుతున్నారు. మదర్స్ డే నాడు ఇప్పుడు ఈ ఆలయం గురించి మీడియాలో ప్రధానంగా కధనాలు ప్రచురితం అయ్యాయి. ఆలయం ప్రత్యేకతల అంశం వైరల్ గా మారుతోంది. తల్లి కోసం గుడిని నిర్మిస్తున్న శ్రావణ్ కుమార్ ను గ్రామస్థులు అభినందిస్తున్నారు.












Click it and Unblock the Notifications