నల్గొండ విషాదం, ప్రభుత్వం పరిహారం: చంద్రబాబు దిగ్భ్రాంతి, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే!
నల్గొండ/హైదరాబాద్: నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు బుధవారం నాడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్ద హర్యానాకు చెందిన ఓ లారీ పుస్తకాల లోడ్‌తో... అతివేగంగా వచ్చి బస్సును ఢీకొంది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి, ఐదుగురు పురుషులు ఉన్నారు.
మృతి చెందిన వారిలో... శ్రీదేవి, అశ్విని, మల్లారెడ్డి (డ్రైవర్), రాజేష్, వెంకన్న, విజయలక్ష్మి, బక్కన్న తదితరులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారు. బస్సు భువనగిరి నుంచి మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరింది. గంటలోపే ప్రమాదం జరిగింది.
మృతుల కుటుంబాలను, గాయపడిన కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం, ఆర్టీసి తరఫున రూ.1లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించారు. గాయపడ్డ వారు నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బస్సు ప్రమాదం ఘటన తెలియగానే స్థానికులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. లారీ వేగంగా వచ్చి ఢీకొట్టగానే బస్సు పక్కనే ఉన్న చిన్న లోయలో పడింది. బస్సు నెంబర్ ఏపీ 20 జెడ్ 2270.
లారీ ఢీకొన్నాక బస్సీ పల్టీలు కొట్టి పక్కన ఉన్న చిన్న లోయలో పడింది. అంతా నిమిషాల వ్యవధిలో జరిగింది. బస్సు సీట్ల కింద, కిటికీ అద్దాల్లో చిక్కుకొని చాలామంది నుజ్జునుజ్జు అయ్యారు. మృతదేహాలు, ఆర్తనాతాలతో వాతావరణం బీభత్సంగా మారింది.
ప్రమాదం విషయం తెలియగానే మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు, అధికారులు వైద్య సిబ్బందికి ఆదేశించారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: మంత్రులు
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి వెల్లడించారు. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను చేపట్టిన తుమ్మలగూడెం, ఇంద్రపాలనగరం ప్రజలకు మంత్రులు ధన్యవాదాలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications