పదో తరగతి పేపర్ లీక్: ముగ్గురు అధికారులు సస్పెండ్, లీకేజీ ఇలా! రేపటి పరీక్ష యథాతథం
నల్గొండ: ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే పదవ తరగతి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయో సైన్స్ టీచర్ ఈ పేపర్ బయటకు రావడానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మండల విద్యాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు టీచర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ వ్యవహారంపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తాండూర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైంది. 9.37 నిమిషాలకే పాఠశాలలో పనిచేసే బందెప్ప అనే బయోసైన్స్ టీచర్ ప్రశ్నపత్రాన్ని తన మొబైల్ ద్వారా ఫొటో తీసి ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. తర్వాత వెంటనే ఆ మెసేజ్ డిలీట్ చేసినప్పటికీ.. ఆ గ్రూప్‌లో ఉన్న మిగితా సభ్యులు ఇతరులకు షేర్ చేశారు.

వాట్సాప్ గ్రూప్‌లో ప్రశ్నపత్రం చక్కర్లు కొడుతున్నట్లు ఎంఈవోకు 11 గంటల సమయంలో సమాచారం అందింది. వెంటనే ఎంఈవో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేపట్టిన పోలీసులు బందెప్ప కారణంగానే ప్రశ్నపత్రం లీకైనట్లు గుర్తించారని కలెక్టర్ వెల్లడించారు. ఇక, పరీక్ష సమయం పూర్తికాకముందే పదో తరగతి ప్రశ్నపత్రం లీకవడంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నారాయణ రెడ్డిని విద్యాశాఖ ఆదేశించింది.
ఈ క్రమంలోనే. పేపర్ లీకేజీకి కారణమైన ముగ్గురు అధికారులు సూపరింటెండెంట్, డిపార్ట్ మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. వారిని పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీక్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు అధికారులు.
ఇప్పటికే టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకేజీ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పదవ తరగతి పరీక్ష పత్రం కూడా లీక్ కావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవ తరగతి బోర్డు కార్యాలయం వద్ద ఎన్ఎస్‌యూఐ నేతలు, విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయంలోకి గుడ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మరోవైపు, రేపటి పదవ తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications