తెలంగాణలో 11.08 లక్షల కేసులు క్లోజ్.. ఎక్కువగా ఏ కేసులంటే ?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 11.08 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయి. ఈ విషయాన్ని సీఐడీ డీజీ చారుసిన్హా ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చి కేసులు పరిష్కరించామని ఆమె వివరించారు.
ఈ లోక్ అదాలత్‌లో భాగంగా 4,539 మంది బాధితులకు ఒక్క రోజులోనే రూ.12.94 కోట్లు రిఫండ్ చేశారు. అంతకుముందు 2,501 మందికి రూ.27.91 కోట్లు అందజేయగా, మొత్తం కలిపి 7,040 మందికి రూ.40.86 కోట్ల రిఫండ్ లభించింది. 2024 మార్చి నుండి 2025 సెప్టెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 36,786 మందికి రూ.321 కోట్ల రిఫండ్ చేసినట్లు కూడా చారుసిన్హా తెలిపారు. ఈ ఏడాది మాత్రమే అన్ని లోక్ అదాలత్‌లలో కలిపి సైబర్ నేరాలకు సంబంధించిన రూ.138.04 కోట్ల ఫ్రీజింగ్ అమౌంట్‌ను 18,872 మందికి అందజేశారు.

రిఫండ్‌లలో టాప్-5 ప్రాంతాల్లో సైబరాబాద్ కమిషనరేట్ రూ.11.51 కోట్లు, హైదరాబాద్ రూ.9.29 కోట్లు, రాచకొండ రూ.6.41 కోట్లు, సీఎస్బీ హెడ్‌క్వార్టర్స్ రూ.4.21 కోట్లు, సంగారెడ్డి జిల్లా రూ.1.04 కోట్లు నమోదు చేసి ముందంజలో నిలిచాయి.
లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసుల్లో ప్రీలిటిగేషన్ కేసులు 3.63 లక్షలు, కోర్టుల్లో పెండింగ్ కేసులు 7.43 లక్షలు ఉన్నాయి. ఈ పరిష్కారాల ఫలితంగా లబ్ధిదారులకు రూ.595 కోట్ల పరిహారం చెల్లింపు ఉత్తర్వులు వెలువడ్డాయని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యాంకోశి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ మౌసమీ భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగింది.
ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయానికి వస్తే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది 20 లక్షల చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో పెద్దమొత్తం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ పెండింగ్ చలానాల వసూళ్ల కోసం ప్రభుత్వం 2023 డిసెంబర్ నుండి 2024 ఫిబ్రవరి వరకు ప్రత్యేక డిస్కౌంట్ స్కీమ్ అమలు చేసింది. ఆ సమయంలో 1.67 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యి, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.150.58 కోట్ల ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications