'క్యాబ్' ఉచ్చు?: అసలేం జరుగుతోంది.. 11మంది ఆత్మహత్యలు, విస్తుపోయే విషయాలు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అందరిదీ డబ్బులు సంపాదించుకుందామన్న ఆత్రుతే. పొట్టకూటికి పోను ఓ నాలుగు రూపాయలు మిగులుతాయంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అందుకే అప్పు చేసైనా పెట్టుబడికి సిద్దమైపోతారు. కానీ కంపెనీల బాధ్యతారాహిత్యం వారిని నిండా ముంచి ఆఖరికి ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు కల్పిస్తుండటం విచారకరం.

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ క్యాబ్ సంస్థలు.. క్యాబ్ డ్రైవర్ల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యానికి వారు పిట్టల్లా రాలిపోతున్నారు. కోట్ల టర్నోవర్ కోసం పరుగులు పెడుతున్న కంపెనీలు.. ఆ క్రమంలో కనీస విలువలను, బాధ్యతలను విస్మరిస్తున్నాయి. ఫలితంగా చాలీచాలని డబ్బులతో జీవితాలను లాక్కురాలేక.. ఏకంగా తనువు చాలిస్తున్నారు.

 ఆర్నెళ్లలో 11మంది:

ఆర్నెళ్లలో 11మంది:

హైదరాబాద్ నగరంలో కేవలం ఆరు నెలల్లోనే 11 మంది క్యాబ్‌ డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెలకు రూ.1లక్ష ఆదాయం గ్యారంటీ అన్న కంపెనీల ప్రకటనలే వారిని నిండా ముంచాయి. చెప్పినట్టుగా ఒకటి, రెండు నెలలు ఆ స్థాయిలో ఆదాయమున్నా.. ఆ తర్వాత నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది.

 ఎందుకీ పరిస్థితి:

ఎందుకీ పరిస్థితి:

బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన క్యాబ్ సంస్థలు.. డ్రైవర్‌ కం ఓనర్‌ స్కీమ్ కింద ఇబ్బడిముబ్బడిగా కొత్త క్యాబ్ లను చేర్చుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అప్పటికే ఉన్న క్యాబ్ డ్రైవర్ల ఆదాయానికి కొత్త క్యాబ్ లు గండికొట్టాయి. దీంతో వీరిలో వీరికే పోటీ తలెత్తింది. సమస్య పరిష్కారానికి కంపెనీ ఎలాంటి చొరవ చూపించకపోవడంతో.. పరిస్థితి తీవ్రత మరింత పెరిగినట్టు తెలుస్తోంది. అప్పు చేసి క్యాబ్ లను కొనుగోలు చేసినవారు.. వచ్చే డబ్బులతో అటు అప్పులు కట్టలేక, ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

 ఎంత ఆదాయం:

ఎంత ఆదాయం:

ఉదాహరణకు క్యాబ్ ద్వారా హిమాయత్ నగర్ నుంచి లింగంపల్లి వరకు వెళ్లారనుకుందాం. ఛార్జీ రూ.400 అయిందనుకుందాం. అందులో నుంచి సంస్థకు 46శాతం పోగా, డ్రైవర్లకు మిగిలేది కేవలం 54శాతం మాత్రమే. అంటే రూ.400ల్లో వారికి మిగిలేది రూ.216మాత్రమే. ఒకరోజులో డ్రైవర్ రూ.3వేలు సంపాదిస్తే.. అతనికి చివరికి మిగిలేది రూ.1620. ఈ డబ్బుతోనే అటు కుటుంబాన్ని నెట్టుకురావాలి, పిల్లల ఫీజులు కట్టాలి?, ఇంటి అద్దె, కారు లోన్స్.. ఇవన్నీ వారికి తలకుమించిన భారమయ్యాయి.

 యాప్ నష్టమా? లాభమా?:

యాప్ నష్టమా? లాభమా?:

తమ యాప్ వాడుతున్నందుకు క్యాబ్ సంస్థలు డ్రైవర్ల నుంచి 46శాతం, 30శాతం డబ్బును కమీషన్ కింద తీసుకుంటున్నాయి. యాప్ ద్వారా క్యాబ్ డ్రైవర్లకు రోజుకు 10 నుంచి 15 డ్రాపింగ్స్ బుక్ అవుతుంటాయి. అదే ఆశతో చాలామంది అప్పు చేసి మరీ క్యాబ్ లను కొనుగోలు చేశారు. కొన్నిరోజులు సంస్థ చెప్పినట్టు రూ.1లక్ష ఆదాయం రావడంతో చాలా సంతోషించారు. కానీ రాను రాను పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవడంతో తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఇదీ జరుగుతోంది:

ఇదీ జరుగుతోంది:

ఓలా, ఉబర్ లాంటి సంస్థలు ఇచ్చిన ఆకర్షణీయ ప్రకటనలు చాలామందిని ఆకర్షించాయి. దీంతో అప్పు చేసి మరీ క్యాబ్ లను కొనుగోలు చేశారు. వీరిలో కొంతమంది ఆయా యాప్‌ సంస్థల ద్వారానే కార్లను కొనుగోలు చేయడం గమనార్హం. వీరి లోన్ తీరిపోవాలంటే దాదాపు 15ఏళ్లు పడుతుందంటున్నారు. క్యాబ్ నడిపించిన నడిపించకపోయినా.. నెల తిరిగేసరికి ఈఎంఐ కట్టాల్సిందే. లేదంటే పెనాల్టీ అదనం. దీంతో చాలామంది క్యాబ్ డ్రైవర్లు రోజుకు 20గం. పాటు పనిచేస్తున్నవారు కూడా ఉన్నారు.

వచ్చిన దాంట్లో నుంచి డీజిల్‌కు రూ.1000, భోజనానికి రూ.100, మెయింట్‌నెన్స్‌కు రూ.100, టోలుగేటు ఫీజులు రూ.50 వరకు ఖర్చవుతుండటంతో.. ఇక తమకు ఏం మిగులుతోందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు. ఈఎంఐకి రూ.17వేలు, డౌన్‌పేమెంట్‌ కోసం కట్టిన చిట్టీలు, ఇలా ఖర్చు తడిసి మోపెడవుతుండటం, ఆదాయం మాత్రం అరకొరగానే ఉండటంతో క్యాబ్ డ్రైవర్ల జీవితాలు ఉచ్చులో చిక్కుకున్నట్టే తయారయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cab drivers are finding it hard to make the income, unable to pay the monthly instalment for cabs, somany are committing suicide

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి