రైతుల కోసం నేను సైతం అంటున్నసూర్యాపేట బాలుడు .. స్క్రాప్ తో మల్టీ పర్పస్ వ్యవసాయ పనిముట్లు
రైతు రాజ్యం రామరాజ్యం అంటారు. అలాంటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచన ఏ ఒక్కరికీ కలగదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన 17 ఏళ్ల అశోక్ కు రైతులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా అతను స్క్రాప్ మెటీరియల్ ను ఉపయోగించి వ్యవసాయాన్ని సులభతరం చేసే, తక్కువ ఖర్చుతో కూడిన కొన్ని పరికరాలను తయారు చేశారు.

దేవరకొండ ఒకేషనల్ కాలేజ్ లో 12వ తరగతి పూర్తి చేసిన అశోక్, సూర్యాపేటలో 17మంది రైతులకు సహాయం చేసేలా కొన్ని పనిముట్లను తయారు చేశారు.

స్క్రాప్ తో వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తున్న సూర్యాపేట యువకుడు
చిన్నప్పటినుండి పుస్తకాలలో చదువుకున్నది కాకుండా, ఇంటి చుట్టూ ఉండే స్క్రాప్ మెటీరియల్ ను ఉపయోగించి కొత్త విషయాలను ఆవిష్కరించడం అభిరుచిగా పెట్టుకున్న అశోక్ ఆరవ తరగతి లోనే సైన్స్ ఫేర్ కోసం హైడ్రాలిక్ జెసిబి మోడల్ తయారు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక కొత్త పరికరాలు తయారు చేస్తూనే ఉన్నారు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అశోక్ తల్లిదండ్రులిద్దరూ వరి సాగు చేస్తూ పడుతున్న కష్టాన్ని చూసి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి, ఆ ఇబ్బందులను అధిగమించటం కోసం కొన్ని వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు.

మల్టీ పర్పస్ అగ్రికల్చర్ టూల్ తయారు చేసిన 17 ఏళ్ళ అశోక్
విత్తనాలు విత్తిన నాటి నుండి, పంటను కోసే వరకు రైతులు ఎదుర్కొంటున్న పోరాటాలను తాను అర్థం చేసుకున్నానని చెబుతున్న అశోక్ రైతులకు ఉపయోగపడేలా, మల్టీ పర్పస్ అగ్రికల్చర్ టూల్ ను తయారు చేశారు.
పొలాల్లో పనిచేయడానికి ఎలాంటి సహాయం పొందలేకపోతున్న తన తండ్రితో సహా చాలా మంది రైతులు ఉన్నారని గుర్తించిన అశోక్ వారి పనిని సులభతరం చేయడానికి, గత సంవత్సరం, వరిని కోయడానికి, సేకరించడానికి మరియు నిర్వహించడానికి ఒక పనిముట్టును తయారు చేశాడు.

స్క్రాప్ గా పారేసే వస్తువులే టూల్స్ గా అశోక్ ఇన్నోవేషన్
వ్యవసాయ పనిముట్టు తయారీ కోసం ముందుగా కాగితంపై డిజైన్‌ను గీసుకున్న అశోక్ గొర్రె, ముడి పదార్థాలను సేకరించి, వెల్డర్ సహాయంతో తనకు కావాల్సిన విధంగా ఆ సాధనాన్ని తయారు చేయించాడు. వ్యవసాయ పనిముట్లు తయారీకి రూ .1700 మాత్రమే ఖర్చు అయిందని అశోక్ చెప్పాడు. ఇనుప కడ్డీలు, పాత సైకిల్ చక్రం మరియు బోల్ట్‌లను ఉపయోగించి తయారు చేయబడిన ఈ ఫోర్ ఇన్ వన్ సాధనాన్ని వరిని కోయడానికి, ధాన్యాన్ని సేకరించడానికి, మరియు మిరప, పత్తి చేలల్లో కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు .
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 లో అశోక్ తయారు చేసిన మోడల్స్ కు మొదటి బహుమతి
గత సంవత్సరం, కోల్‌కతాలోని విజ్ఞాన భారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 లో నిర్వహించిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ మోడల్ పోటీలో మొదటి బహుమతిని కూడా అశోక్ గొర్రె గెలుచుకున్నారు. లాక్డౌన్ సమయంలో, అశోక్ వరి పంటలలో కలుపు మొక్కలను తొలగించగల పోర్టబుల్ కలుపు తీసే సాధనం తయారు చేశాడు.

రైతుల కోసం వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తున్న యువకుడికి హ్యాట్సాఫ్
రైతు దినోత్సవం నాడు రైతులకు సహాయపడే లా వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తున్న ఈ యువ ఆవిష్కర్తకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రైతుల కష్టాన్ని మనసుతో చూసి, వారి కష్టాలను తొలగించడానికి అనేక వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తున్న అశోక్ కు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇస్తే , ఎంతో మంది రైతులకు మేలు చేకూర్చేలా, వారి శ్రమను తగ్గించేలా వ్యవసాయ పనిముట్లను రూపొందిస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.