25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బీజేపీకి 2 నుంచి 3, బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపై విమర్శలుగుప్పించారు.
కేసీఆర్ శకం ఇక ముగిసిందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. నీటి వాటాల పంపకాల్లో జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని ధ్వజమెత్తారు. మిర్యాలగూడకు కేసీఆర్ ఏ మొఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు.

పది సంవత్సరాల్లో ఏమీ చేయని కేసీఆర్.. బస్సు యాత్ర ద్వారా ఏం చేస్తారని కోమటిరెడ్డి నిలదీశారు. కారు పార్టీ ఒక్క సీట్ కూడా గెలవదని, మెదక్ స్థానం ఒక్కటి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. తాను పిలిస్తే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ, భువనగిరిలోని గులాబీ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారని మంత్రి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల గురించి గుత్తా సుఖేందర్ రెడ్డికి బాగా తెలుసన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది మంత్రి కోమటి రెడ్డి ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications