తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం
Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున జిల్లాలోని చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 34 టీఏ 6354 ఎక్స్ ప్రెస్ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్- మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నంబర్ టీజీ 06 టీ 3879 భారీ టిప్పర్ బస్సును వేగంగా ఢీకొట్టింది. కంకర లోడ్ తో వెళ్తోన్న టిప్పర్ అది.

బస్ డ్రైవర్ హారన్ మోగిస్తూ, హెడ్ లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తోన్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. టిప్పర్ ను తప్పించడానికి డ్రైవర్ కుడి వైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్, ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడటం అందర్నీ కలచివేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందినిగా గుర్తించారు. వారి స్వస్థలం తాండూరు. ముగ్గురు హైదరాబాద్ లో చదువుకుంటోన్నారు. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరు కావడానికి తాండూరుకు వచ్చారు. తనూష ఎంబీఏ, సాయిప్రియ ఢిగ్రీ థర్డ్ ఇయర్, నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.
సోమవారం కాలేజీకి వెళ్లాల్సి ఉన్నందున.. ఈ తెల్లవారు జామున తాండూరులో హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కారు. అదే బస్సు చేవెళ్ల వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పెళ్లిలో ఆడుతూ పాడుతూ సందడి చేస్తూ కళ్లముందు కనిపించిన వాళ్లు ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది.
కాగా- బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చారు. మీర్జాగూడ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయని, దీన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించాలని అన్నారు. మలుపు కావడం, ఎదురుగా వస్తోన్న వాహనం కనిపించకుండా చెట్లు అడ్డుగా ఉండటం, రోడ్డు విస్తరణ జరక్కపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రాంతంలో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications