ఒకే సిరంజీతో 30మంది చిన్నారులకు ఇంజెక్షన్
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో నర్సుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఒకే సిరంజితో మొత్తం 30మందికి చిన్నారులకు ఇంజక్షన్ చేయడంతో అది కాస్తా వికటించింది. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిలోఫర్‌లోని ఎమర్జెన్సీ విభాగం మూడో అంతస్తులో ఐదేళ్లలోపున్న 30 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
వైద్యులు రాసిచ్చిన దాని ప్రకారం వారికి రెగ్యులర్‌గా ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు ఒక్కో రోగికి ఒక్కో సిరంజిని ఉపయోగించాలి. కానీ, ఆదివారం రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ఒకే సిరంజితో మొత్తం 30 మంది చిన్నారులకూ ఇంజక్షన్లు చేసేశారు. దీంతో, కొందరికి చేతులు వాచిపోయాయి. మరికొందరికి రక్తం గడ్డ కట్టింది. నొప్పిని భరించలేక చిన్నారుల ఏడుపులు తీవ్రమయ్యాయి.

ఆందోళనకు గురైన తల్లిదండ్రులకు చిన్నారుల చేతులను చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. దీనిపై నర్సులను నిలదీయగా, ఇప్పుడు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆదివారం కావడంతో వైద్యులు అందుబాటులో లేరు. పోలీసులు తల్లిదండ్రులను అదుపు చేసి సోమవారం అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కాగా, చిన్నారుల తల్లిదండ్రులు సోమవారం ఆర్ఎంకు పిర్యాదు చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పిన వైద్యులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications