మెగా టెక్స్ టైల్ పార్క్ లో త్వరలో 33వేల ఉద్యోగాలు: మంత్రి కేటీఆర్
వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కే తారకరామారావు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వరంగల్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారని, టెక్స్టైల్ పార్కు భూమిని సేకరించడంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.
నల్ల బంగారమే కాదు మన దగ్గర తెల్లబంగారం కూడా ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన పత్తి మన దగ్గర పడుతుందన్నారు. అందుకే ఆనాడు ఆజంజాహి మిల్లు ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన యంగ్ వన్ కంపెనీ 11 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తుందని, అందులో 21 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో 3 కంపెనీల ద్వారా ౩౩వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు.

ఉద్యోగాలలో స్థానికులకు 99% అవకాశం కల్పిస్తామన్నారు. మహిళలకు 85 శాతం అవకాశాలు కల్పిస్తామన్నారు. యంగ్ వన్ కంపెనీలో ప్రపంచంలోనే అత్యుత్తమమైన దుస్తులు తయారవుతాయి అన్నారు. మేడిన్ ఇండియా మేడిన్ పరకాల గా మారుతుందన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దిక్సూచిగా మారిందన్నారు. ఫామ్ నుంచి ఫ్యాక్టరీ పేరుతో ఇక్కడ అత్యుత్తమ పత్తి పండిస్తున్న ఈ ప్రాంతంలో యంగ్ వన్ కంపెనీ వస్త్రపరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
కేంద్రానికి మొన్న సోయి వచ్చిందని, ఇంత కాలం తర్వాత పీఎం మిత్ర తీసుకువచ్చిందని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుంది. మన పథకాలను కాఫీ కొట్టి పేర్లు మార్చి కేంద్రం అమలు చేస్తుందన్నారు. ఐదేళ్ళు మీ కోసం కష్టపడ్డాం. మాకు కష్టం వచ్చినప్పుడు ఎన్నికల పరీక్ష కాలంలో మాకు అండగా ఉండాలన్నారు.
ఇప్పటికే గణేష్, కిటెక్స్ సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించామన్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరకాలలో చల్లా ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే ప్రతిపక్షాల అభ్యర్థులు భయపడుతున్నారు. నవంబర్, డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. కేసిఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications