త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ: యువతకు రేవంత్ కీలక సూచనలు
త్వరలోనే భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రాంను సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(BFSI) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగానే స్కిల్ ప్రోగ్రాం ప్రారంభించిందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు.
నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం రేవంత్ తెలిపారు. బీఎఫ్ఎస్ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు కోర్సు ప్రారంభిస్తున్నామన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదని సీఎం ఆక్షేపించారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని సీఎం రేవంత్ హెచ్చరించారు.

త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. ఏటా 3లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారన్న సీఎం రేవంత్, ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడినట్లు తెలిపారు.
ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని పరిశ్రమల యజమానులను అడుగుతున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత డిమాండ్-సప్లయ్ సూత్రం గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిగా ఆలోచించాలి. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలని రేవంత్ చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే చెడు వ్యవసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
ఈ క్రమంలోనే బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదని అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలని.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications