4 లక్షల బియ్యం బస్తాలు ఏమయ్యాయి?: కేసీఆర్, కేటీఆర్‌లపై కిషన్ రెడ్డి ఫైర్, రైస్ మిల్లుల తనిఖీలు
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగా రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల దుస్థితికి కేసీఆర్ సర్కారే కారణం: కిషన్ రెడ్డి
ఏప్రిల్ 13న రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ పంపుతామని.. కేంద్రం తీసుకోవాలని కోరారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం బియ్యం తీసుకోవటం కోసం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణాత్మకమయిన వైఖరితో, విమర్శలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రం ఆలస్యం చెయ్యటం వల్ల రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సి వచ్చింది. తమ రాజకీయ స్వలాభం కోసం, రైతుల జీవితాలతో చెలగాటం ఆడారని కేసీఆర్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

కేసీఆర్, కేటీఆర్ తట్టల్లో బియ్యం మోస్తారా?: కిషన్ రెడ్డి
ఉప్పుడు బియ్యం పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం అంగీకారాన్ని తెలిపిందన్నారు. వడ్ల కొనుగోలు కోసం ఏ రకమయిన ఏర్పాట్లు చెయ్యలేదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బాధ్యతారహితంగా రాష్ట్ర సర్కార్ వ్యవహరించిందని మండిపడ్డారు.
గత ఖరీఫ్, రబీ సీజన్ల బియ్యాన్ని ఇప్పటికి ఇవ్వలేదు. తెలంగాణలో 15 కోట్ల గోనె సంచులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోటి సంచులు కూడా లేవు. కేసీఆర్, కేటీఆర్‌లు తట్టల్లో బియ్యం మోస్తారా? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందన్నారు. యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యాలి. నూకల నుంచి బయో ఫ్యుయల్ తయారు చేయొచ్చు.. అందుకోసం బయో ఫ్యూయల్ తయారీ కోసం బోర్డ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

4 లక్షల బియ్యం బస్తాలు ఏమయ్యాయి.. తనిఖీలకు ఆదేశం: కిషన్ రెడ్డి
రైస్ మిల్స్‌లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో ఉండటం లేదు. తెలంగాణలో అన్ని రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని అధికారులను అదేశించామని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 40 రైస్ మిల్స్ తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల బియ్యం తక్కువ ఉంది. సీబీఐ దర్యాప్తు కోసం ఓ నాయకుడు లేఖ రాశారు. వాస్తవానికి రైస్ మిల్లులపై కేంద్రానికి అధికారం లేదు. ఇంతకూ ఆ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలన్నారు. రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్
రైతుల విషయంలో కేంద్రానికి కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో రైతులు మాకు మద్దతుగా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆర్ధిక సాయం చెయ్యాలి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఆర్ధిక సాయం చెయ్యాలి. జీహెచ్‌ఎంసీలో ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్నీ రావణకాష్టం చేస్తున్నారు. రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలున్నాయి. కమీషన్ల కోసం అప్పులు తీసుకుంటున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications