తెలంగాణలో కరోనా వైరస్ కొత్త కేసులు ఎన్నంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ తన బులిటెన్‌లో పేర్కొంది.
కొత్త కేసుల్లో నాలుగు హైదరాబాద్‌లో నమోదు కాగా, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 19 మంది ఐసోలేషన్ లో ఉండగా.. 54 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే ఆస్పత్రిలో చేరి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.

కాగా, కేరళ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. ప్రస్తుతం జేఎన్1 వేరియంట్ రకం ఎక్కువగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవటంతో పాటు మహమ్మారి విజృంభిస్తే సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఆస్పత్రులను కూడా సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, దేశంలో కొత్తగా 594 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2,699 కరోనా పాజిటివ్ కేసుల్ని గుర్తించారు. కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవుతోన్న క్రమంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు. చెస్ట్ హాస్పిటల్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేలా టెస్టులు పెంచుతున్నామన్నారు సూపరింటెండెంట్ ఖాన్. భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications