దసరాకు 620 ప్రత్యేక రైళ్ళు: దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్; పండుగ చేసుకోండి!!
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. పిల్లలకు దసరా పండుగకు ఎక్కువ రోజులు సెలవులు రావడంతో పండుగ సెలవులను ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయాణాలు చేస్తారు. ఇక ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలలో సెటిలైన వారు కూడా ఈ సమయంలో పండుగ చేసుకోవడానికి సొంత గ్రామాలకు వెళ్తారు.
దసరా సందర్భంగా రైల్వే స్టేషన్లు, బస్టాండులు కిట కిటలాడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ఇచ్చారు. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నం జరుగుతోంది. దసరా పండుగకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంటే, రైల్వే శాఖ దసరా రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.

దసరా పండుగ రద్దీ దృష్ట్యా 620 ప్రత్యేకమైన రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా నడపనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి సహా ప్రధాన రైల్వే స్టేషన్ ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేకమైన రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉండే కారణంగా, ఎక్కువమంది విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉందని, అదనపు రైళ్లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. వీటితోపాటు జైపూర్, షిరిడి, రామేశ్వరం మరియు ఇతర ప్రధాన రద్దీ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ట్రైన్ లను నడపనున్నారు.
ఇక ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, దసరా పండుగకు ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణం చేయడానికి అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications