తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి, పెరిగిన మరణాలు: రాష్ట్రంలో ఇంటికే కరోనా మెడికల్ కిట్లు
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(శనివారం రాత్రి 8 గంటల వరకు) 76,330 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 7430 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించింది.

తెలంగాణలో కొత్తగా కరోనాతో 56 మంది మృతి
రాష్ట్రంలో ఆదివారం కరోనాతో 56 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 2368కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1546 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,30,60,114 కరోనా పరీక్షలను నిర్వహించారు.

తెలంగాణలో ఇంటికే కరోనా మెడికల్ కిట్లు
రాష్ట్రంలోని కరోనా బాధితుల కోసం మరో 5 లక్షల మెడికల్ కిట్లను ఇంటి వద్దకే పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. కరోనా బాధితులకు అన్ని జిల్లాల్లో హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ నెంబర్ 040-2111-1111ను సంప్రదించాలని కోరారు.

తెలంగాణలో మరో 10వేల పడకలకు ఆక్సిజన్
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కరోనాపై సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మరో 10వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎస్ తెలిపారు. కరోనా బాధితులకు 60వేల పడకలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నిమ్స్‌లో 500, సరోజినీదేవి, టిమ్స్‌లో 200 చొప్పున, గోల్కొండ, మలక్‌పేట్ ఆస్పత్రుల్లో 100 చొప్పున, అమీర్‌పేట్, ఛాతీ ఆస్పత్రుల్లో 50 చొప్పున అదనపు పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక, హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించనున్నట్లు సీఎస్ వెల్లడించారు.

కరోనా టీకాలు, ఆక్సిజన్ కోసం కేంద్రానికి లేఖ
రాష్ట్రానికి మరికొన్ని కోవిడ్ టీకాలను ఇవ్వాలని, ఆక్సిజన్ కేటాయింపులు 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీఎస్ తెలిపారు. కాగా, కరోనా మందుల పర్యవేక్షణకు సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలో, ఖాళీల భర్తీ పర్యవేక్షణకు రఘునందన్ రావు నేతృత్వంలో, రెమిడిసివిర్ వంటి ఔషధాల కోసం జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications