తెలంగాణలో కొత్తగా 9 కేసులు: హైదరాబాద్‌లోనే 8, యాక్టివ్ కేసులు ఎన్నంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ మహమ్మారి కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు ఒకటి రెండు కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు రెండంకెలకు సమీపంలోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 27 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు రికవరీ అయ్యారు. తాజాగా నమోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నీలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. ఆ పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా తమ నివాసాల నుంచి బయటకు రాకూడదని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, వైద్యులను సంప్రదించాలనిసూచించింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త నాలుగు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 640 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 22 కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. కేరళ, గోవాలో కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో తాజాగా మరో వ్యక్తి మరణించారు.












Click it and Unblock the Notifications