మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ కావడం, కెసిఆర్ సిట్ విచారణకు హాజరు కావలసి రావడం వంటి ఘటనలు రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. తెలంగాణ మాజీ సీఎంకు ఫోన్ టాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ శ్రేణులు నిరసనలకు తెర తీశాయి.
వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మాజీమంత్రి ఎర్రబెల్లి ఆందోళన
నిరసనల్లో భాగంగా ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు 33మంది పైన కేసులు
తాజా పరిణామాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు 33 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వర్ధన్నపేట మున్సిపాలిటీ కి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ముందస్తు అనుమతి లేకుండా నిరసనలకు పాల్పడటం వంటి చర్యలతో ఆయన పైన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు 33 మంది పైన కేసులు నమోదు చేయడం ప్రస్తుతం స్థానిక రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలకు ప్రజలలోకి వెళుతున్న క్రమంలో దీనికి సంబంధించిన మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల సమయంలో, కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తామని తేల్చి చెప్తున్నారు.












Click it and Unblock the Notifications