అజారుద్దీన్‌పై కేసు నమోదు: ఎందుకంటే?
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అజారుద్దీ (Mohammad Azharuddin) కేసు నమోదైంది. హెచ్‌సీఏ సీఈవో సునీల్ కంటె గురువారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్ పై ఫిర్యాదు చేశారు. 2020-2023 మధ్య కాలంలో జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, క్రికెట్ బాల్స్, బకెట్ ఛైర్స్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సెక్ ఆడిట్‌లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఈ క్రమంలో కొనుగోలు కమిటీలో ఉన్న అజారుద్దీన్, జాన్ మనోజ్, విజయానంద్ లపై ఉప్పల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, కొద్ది రోజుల క్రితం జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అజారుద్దీన్ పై వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్ పై అనర్హత వేటు పడింది. లావు నాగేశ్వరరావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్‌సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. దీంతో రానున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.
మరోవైపు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల్లోపు హెచ్‌సీఏ ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈసారి హెచ్ సీఏ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానళ్లు తలపడుతుండగా.. ప్రధాన పోటీ గులాబీ వర్సెస్ కమలంగా కనిపిస్తుండటం గమనార్హం. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications