వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కస్తూర్బా విద్యార్థిని మృతి: అధికారి నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: వెంకాపురం(నూగూరు) మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి (కేజీబీవీ) చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. కుటుంబసభ్యులు, అధికారులు తెలిపిన ప్రకారం... మండల పరిధిలోని కోయబెస్తగూడెం గ్రామానికి చెందిన పొడెం కీర్తి (13) మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో 7వ తరగతి చదువుతోంది.

కీర్తికి జ్వరం రావడంతో మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లిన కస్తూర్బా అధికారులు తల్లిదండ్రులకు సమచారం ఇచ్చారు. మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం ఉదయం వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడే చికిత్సపొందుతూ మృతి చెందింది.

కాగా, తమ కూతురు మృతికి కస్తూర్బా విద్యాలయానికి చెందిన ప్రత్యేక అధికారి సునిత కారణమని కీర్తి తండ్రి పొడెం నాగేశ్వర్‌రావు ఆరోపించారు. పరిస్థితి విషమించే వరకు తమకు తెలియజేయలేదని వాపోయారు. బంధువులు, కుటుంబ సభ్యులు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామం వద్ద భద్రాచలం-వెంకాపురం ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించి కీర్తి మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు.

A kasturba student allegedly died in Warangal district

ప్రత్యేక అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మృతదేహంతో వెవెంకాపురంలోని కేజీబీవీ హాస్టల్‌ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. సంఘటన ప్రాంతానికి తహసీల్దార్‌ దేవప్రసాదరావు, ఎస్సై బండారి కుమార్‌, ఎంఈవో వీరభద్రం చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

అత్యాశకు పోయి.. ఏసీబీకు చిక్కి తహసీల్దార్: అర్బన్‌ ఆర్డీవో కార్యాలయంలో ఘటన

వరంగల్‌: భూనిర్వాసితులకు పరిహారం చెక్కు ఇవ్వకుండా డబ్బులు డిమాండ్‌ చేసి, లంచం తీసుకుంటుండగా వరంగల్‌ అర్బన్‌ ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉప తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా వివరాల ప్రకారం... విశ్రాంత ఎస్సై సీహెచ్‌ మధుసూదన్‌రెడ్డి కూతురు స్వాతికి 2010లో స్టేషన్‌ఘన్‌పూర్‌ రోడ్డుకు పక్కనే 465 గజాల ప్లాట్‌ను కొనుగోలు చేసి ఇచ్చారు.

యాదాద్రి నుంచి మడికొండ వరకు నాలుగు లైన్ల రోడ్ల విస్తరణలో భాగంగా 1.77 మీటర్ల స్థలం పోయింది. దీనికి సంబంధించిన రూ.7,11,252 పరిహారం ప్రభుత్వం మంజూరు చేసింది. వరంగల్‌ అర్బన్‌ ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న ఉప తహసీల్దార్‌ శ్రీనివాస్‌గౌడ్‌ చెక్కు ఇవ్వాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంత ఇచ్చుకోలేమన్నా ఆయన వినలేదు. కనీసం రూ.1.50 లక్షలు ఇవ్వాలని, అందులోంచి ఇతర అధికారులకు వెళ్తాయని, లేదంటే చెక్కు రావడం ఆలస్యమవుతుందని చెప్పడంతో మధుసూదన్‌రెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ వారి ప్రణాళిక ప్రకారం గురువారం మధుసూదన్‌రెడ్డి వరంగల్‌ అర్బన్‌ ఆర్డీవో కార్యాలయంలో శ్రీనివాస్‌గౌడ్‌కు రూ.1.30 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేసి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ దాడులలో ఏసీబీ అధికారులు రాఘవేందర్‌రావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలసముద్రంలోని శ్రీనివాస్‌గౌడ్‌ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

సెల్‌ఫోన్‌ కోసం బాలుడి ఆత్మహత్య

కోరుట్ల: సెల్‌ఫోన్‌ కోసం తమ్ముడితో గొడవపడి అన్న ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. వాసాల రవీందర్‌-అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. రవీందర్‌ ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లాడు. అరుణ బుధవారం రాత్రి బీడీలు చుట్టేందుకు పక్కింటికి వెళ్లింది.

ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్‌, అతని తమ్ముడు నాగేంద్రవర్మ ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్‌తో ఆడుకుంటూ టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ కోసం అన్నదమ్ములిద్దరూ కొద్దిసేపు గొడవపడ్డారు. తమ్ముడు తనకు సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో హర్షవర్దన్‌ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన తల్లి విషయం తెలుసుకొని కిటికీలోంచి గదిలోకి చూసింది. హర్షవర్దన్‌ దూలానికి ఉరివేసుకోవడంతో పక్కింట్లో బంధువులకు చెప్పగా వారు వచ్చి గది తలుపులు తెరిచేసరికే హర్షవర్దన్‌ మృతి చెందాడు. గురువారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: రూ.13 లక్షల విలువ చేసే వస్తువులు స్వాధీనం

వరంగల్‌: తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మౌలాలికి చెందిన నూక పోతరాజు అలియాస్‌ రాజు, ఎండీ సదామ్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ ఇద్దరు కలిసి వరంగల్‌ నగరంలో పలు ఇళ్లల్లో చోరీలు చేశారు.

పోతరాజు పెయింటర్‌గా, సదామ్‌ వెల్డర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు ఒకే ప్రాంతాానికి చెందిన వారు కావడంతో వారి మధ్య స్నేహం కుదిరింది. వారు సంపాదించే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో చోరీలు చేసేందుకు ప్రణాళిక రచించారు. 2012లో హైదరాబాద్‌ మౌలాలి, మల్కజీగిరి, చర్లపల్లి ప్రాంతాలలో తాళం వేసి ఉన్న ఏడిళ్లల్లో చోరీలు చేశారు.

అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. గత ఏడాది డిసెంబరులో బెయిల్‌పై విడుదలైన తర్వాత వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 15 చోరీలు చేశారు. కేయూ పోలీసుస్టేషన్‌ పరిధిలో 6, హన్మకొండలో 2, సుబేదారిలో 2, కాజీపేట, మిల్స్‌కాలనీ, దుగ్గొండి, పరకాల, జనగామ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున దొంగతనాలు చేశారు.

ప్రత్యేక బృందంతో చిక్కిన నిందితులు

చోరీ చేసిన సొమ్మును గురువారం ఉదయం హన్మకొండ టైలర్‌స్ట్రీట్‌లో విక్రయించేందుకు రాగా ప్రత్యేక బృందం పోలీసులకు సమాచారం అందింది. సీసీఎస్‌ ఏసీపీ ఆదేశాల మేరకు కేయూ ఇన్‌స్పెక్టర్‌ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.13 లక్షల విలువ చేసే బంగారు, 3 కిలోల వెండి వస్తువులను ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను గుర్తించి సకాలంలో పట్టుకున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్‌, కేయూ ఇన్‌స్పెక్టరు అలీ, సీసీఎస్‌ ఎస్సై సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, హెడ్‌కానిస్టేబుళ్లు కె.శివకుమార్‌, తోట వీరస్వామి, కానిస్టేబుళ్లు మహేశ్వర్‌, వెంకటస్వామి, బి.రాజశేఖర్‌, పి.శ్రీకాంత్‌, వి.జంపయ్యలను పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో కేడీ షీట్స్‌ను తెరుస్తామని సీపీ పేర్కొన్నారు. ఇలా చేస్తే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.

English summary
A Kasturba student allegedly died in Warangal district on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X