హైకోర్టు వద్ద వ్యక్తి దారుణ హత్య.. అందరూ చూస్తుండగానే పొడిచి చంపేశారు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సమీపంలో గురువారం దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు ఈ దారుణానికి పాల్పాడ్డాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద రూ. 10 వేల కోసం ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి మరో వ్యక్తిని అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే మిథుథన్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

కారం ఎక్కువైందన్నందుకు కత్తితో దాడి
చిన్న కారణంతో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో చేసుకుంది. చికెన్ పకోడిలో కారం ఎక్కువ అయిందని చెప్పిన కస్టమర్‌పై కత్తితో దాడి చేశాడు ఓ పకోడి షాప్ యజమాని. చేతిపై, చెవిపై తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని 9వ ఫేజులో ఉన్న జెఎస్ చికెన్ పకోడి సెంటర్ వద్దకు తినేందుకు వెళ్లాడు కస్టమర్ నాగార్జున. చికెన్ పకోడీ తింటున్న క్రమంలో కారం ఎక్కువయ్యిందంటూ షాప్ నిర్వాహకుడు జీవన్‌కు చెప్పాడు. దీనికే కోపోద్రేకుడైన షాప్ యజమాని జీవన్.. తింటే తినండి లేకుంటే వెళ్ళిపో అంటూ దూషించాడు.
ఈ క్రమంలో కస్టమర్ నాగార్జున షాపు ఓనర్ జీవన్ కి మధ్య గొడవ జరిగింది. తీవ్ర పదజాలంతో కస్టమర్ ను తిట్టాడు ఓనర్ జీవన్. గొడవ పెద్దది కావడంతో కస్టమర్ నాగార్జునపై జీవన్ కత్తితో దాడి చేస్తుండగా.. అడ్డుగా వెళ్లిన ప్రణీత్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications