భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన భర్త.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన..
ఓ వ్యక్తి భార్యపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భోజ్యా తండా పంచాయతీ పరిధిలో జరిగింది. పుల్లుడు తండాలో లావుడ్యా సమా అనే వ్యక్తి భార్య శాంతితో నివాసం ఉంటున్నాడు. అయితే సమా తాగుడుకు బానిసయ్యాడు. అతను రోజూ తాగొచ్చి భార్య శాంతితో గొడవపడే వాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం తాగి వచ్చాడు. భార్య శాంతితో మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు.
శాంతి షాప్ కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సమా ఆమెపై నాటు తుపాకితో వెనక వైపు నుంచి కాల్పులు జరిపాడు. శరీరంలోకి బుల్లెట్లు దిగడంతో ఆమె అక్కడికక్కడే కింద పడిపోయింది. సమా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శాంతిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో శాంతిని హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

నాటు తుపాకీతో సమా కాల్పులు జరపడం స్థానికంగా సంచనలం సృష్టించింది. అతని చేతికి తుపాకీ ఎలా వచ్చింది. అతనికి మావోయిస్టులకు ఏమైన సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే సమా అడవిలో జంతువులను వేటాడానికి నాటు తుపాకీ వాడే వాడని స్థానికులు చెబుతున్నారు. అదే తుపాకీ భార్య పై కాల్పులు జరిపాడని శాంతి తల్లి, పిల్లలు చెబుతున్నారు. సమా, శాంతికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
పరారీలో ఉన్న సమా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను చత్తీస్ గఢ్ పరిపోయాడా లేక అడవిలో ఉన్నాడా అనేది తెలియడం లేదు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అతని ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమా ఏం చేసిన భార్య శాంతి భరించిందని స్థానికులు తెలిపారు. కానీ సమా ఇంత పని చేస్తాడని అనుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications