నా చేతిలో తెలంగాణ వీలునామా
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రజా విజయోత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ వేడుకలు సాగుతున్నాయి. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనుంది ప్రభుత్వం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా ఈ వేడుకలనూ నిర్వహిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

సచివాలయంలో నిర్మితమౌతోన్న తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అదే రోజున కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంతో సంతృప్తినిచ్చిందంటూ వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో సరికొత్త అధ్యాయం ఆరంభమైందని పేర్కొన్నారు. అసలు సిసలైన ప్రజా పాలనకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అవిశ్రాంతంగా కృషి చేస్తోందని అన్నారు.
ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలన్నింటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023వ తేదీన తెలంగాణ తన చేతుల్లో పెట్టిందని అన్నారు. తన వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను ఈ సమాజం తనకు అప్పగించిందని చెప్పారు.
పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను...
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2024
ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను...
అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి...
డిసెంబర్ 7, 2023 నాడు...
తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.
తన వారసత్వాన్ని సగర్వంగా...
సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే
బాధ్యతను అప్పగించింది.
ఆక్షణం నుండి...
జన… pic.twitter.com/z31HWss8ZZ
ఆ క్షణం నుండి, జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో, సకల జనహితమే పరమావధిగా, జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా, సహచరుల సహకారంతో, జనహితుల ప్రోత్సాహంతో, విమర్శలను సహిస్తూ, విద్వేషాలను ఎదిరిస్తూ, స్వేచ్ఛకు రెక్కలు తొడిగిందని అన్నారు.
ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి, అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపడానికి అహర్నిశలు కృషి చేస్తోన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ, నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ, నిరంతరం జ్వలించే, ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా, విరామం ఎరుగక, విశ్రాంతి కోరక.. ముందుకు సాగిపోతున్నానని పేర్కొన్నారు.
ఈ ఏడాది ప్రజా పాలనలో తనకు ఎంతగానో సంతృప్తి ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. సమస్త ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడమే తన సంప్రాప్తిగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications