Crime News: లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 15 మందికి గాయాలు..
నిజామాబాద్ జిల్లా పెర్కిట్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది.
ఈ మధ్య తరుచూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. సమయానికి గమ్యం చేరాలన్న యాజమాన్యం ఆదేశాలతో డ్రైవర్లు వేగంగా బస్సులు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా జాతీయ రహదారి 44లో లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం పెర్కిట్ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.

38 మంది ప్రయాణికులు
38 మంది ప్రయాణికులతో రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిద్ర మత్తులో డ్రైవర్
తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తలో బస్సు నడపడమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు.

దేవలమ్మనాగారం
చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారానికి చెందిన పలువురు మహిళలు దండుమల్కాపురంలోని శ్వేతా తెలుగు ఫుడ్స్‌కు చెందిన పచ్చళ్ల పరిశ్రమలో పని చేస్తున్నారు. రోజు మాదిరిగానే ఆటో డ్రైవర్ కొండ వెంకటేశం మహిళా కూలీలను ఆటోలో ఎక్కించుకొని పరిశ్రమకు బయలుదేరాడు.పార్కు కూడలి వద్ద అదే పరిశ్రమకు చెందిన బస్సు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కూలీలను తీసుకొస్తూఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలని ప్రయాణికులు డాకోజి నాగలక్ష్మి, సిలువేరు ధనలక్ష్మి, వరకాంతం అనసూయ, దేవరపల్లి శిరీష మృతి చెందారు.

గ్రామస్థుల ఆందోళన
బుట్టి యామిని, కొండ కావ్య, కోయిగూర అఖిల, ఆటో డ్రైవర్ వెంకటేశం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మృతులు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పరిశ్రమ ముందు దేవలమ్మనాగారం గ్రామ వాసులు ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరైన అనసూయ మినహా మిగిలిన వారందరికీ పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు.

ఇద్దరు మృతి
మరో ప్రమాద ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. శ్రీనివాస్, అఖిల్, సతీష్ అనే ముగ్గురు యువకులు దిలావర్పూర్ నుంచి రాంపూర్ గ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైంసా నుంచి నిర్మల్ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. గాయపడిన సతీష్ ను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications