‘కేసీఆర్‌కు ఎదురులేదు-ప్రతిపక్షాలకు అడ్రస్ లేదు’: సర్వే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దకాలానికి పైగా పోరాటం చేసి లక్ష్యం నెరవేరిన తర్వాత నూతన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, ఆయన పార్టీకి తిరుగులేదని ఓ సర్వే తేల్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాల పార్టీల ప్రభావం తీసికట్టుగా మారిపోయిందని స్పష్టం చేసింది.
అంతేగాక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలోని 109 నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. రెండున్నరేళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదని సర్వే పేర్కొంది.
ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు
తాజాగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు మొదలుకుని.. వివిధ సంక్షేమ పథకాల అమలుదాకా.. సీఎం పని తీరునుంచి.. స్థానిక ఎమ్మెల్యేల సామర్థ్యందాకా.. అనేక ప్రశ్నలతో సేకరించిన అభిప్రాయాలు.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని స్పష్టంచేస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు ఘోర పరాభవం తప్పదని తేల్చిందీ సర్వే.
సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ అంతటా టిఆర్ఎస్ ప్రభంజనమే కనిపించింది. పాత 10జిల్లాలు ప్రామాణికంగా రాష్ట్రంలో వారంపాటు సర్వే చేసి.. సీఎఫ్ఎష్ ఈ ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ పార్టీకి రికార్డు స్థాయిలో ఓట్ల శాతం లభిస్తుందని తేల్చింది.

మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీకి 109 సీట్లు ఖాయమని కుండబద్దలు కొట్టింది. కారు దూకుడుకు కాంగ్రెస్, టిడిపి, బిజెపిల అడ్రస్ గల్లంతవడం ఖాయమని స్పష్టం చేసింది. ఇక టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి లేదని సర్వే స్పష్టం చేసింది.
టిఆర్ఎస్ పాలనకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని సర్వే తెలిపింది. కేసీఆర్ సర్కారుకు జనం బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొంది. 79.2శాతం మంది సీఎం కేసీఆర్ పాలను సమర్థిస్తున్నారని తేల్చింది. గులాబీ పార్టీకే అండగా నిలుస్తామని అత్యధిక మంది ప్రజలు చెబుతున్నారని సర్వే స్పష్టం చేసింది. కాగా, మిడ్‌టర్మ్ హియరింగ్ పేరిట టీవీ9 చానల్ ఈ వివరాలను శుక్రవారం రాత్రి ప్రసారం చేసింది.
పాతబస్తీలో టిఆర్ఎస్
కాగా, ఎంఐఎం పార్టీకి ప్రత్యామ్నాయంగా పాతబస్తీలో టిఆర్ఎస్ పార్టీ ఎదుగుతోందని సర్వే తెలిపింది. బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం తర్వాత స్థానంలో టీఆర్‌ఎస్ నిలువడం గమనార్హం. ఈ రెండు పార్టీల మధ్య తేడా కూడా అతి తక్కువ ఉంది. కొన్ని చోట్ల కేవలం మూడు శాతం మాత్రమే ఉండటం విశేషం.
ఖమ్మంలోనూ దూసుకెళ్తోంది..
ఇప్పటి వరకు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాలోనూ టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు 60శాతానికిపైగా ఓట్లు లభిస్తాయని టీవీ9 సర్వే తేల్చి చెప్తున్నది. ఈ జిల్లాలో సీపీఎంకు 4.9శాతం ఓట్లు, సీపీఐకి 1.8% ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. కాగా, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఆయనకు, టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని సర్వే స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications