రైల్వేస్టేషన్‌లో హృదయ విదారకరం: తల్లి శవంపైనే నిద్రించిన చిన్నారి
హైదరాబాద్: నగర శివారు ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి 10 గంటల సమయం..ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం ప్రయాణికులతో రద్దీగా ఉంది. అదే సమయంలో సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ రెండేళ్ల వయసున్న కుమారుడితో రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఫ్లాట్‌ఫాంపైకి చేరుకుంటూనే మూర్ఛవ్యాధితో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
కాగా, ఆ రెండేళ్ల చిన్నారి మాత్రం తల్లి మరణించిందన్న విషయం తెలియక.. ఆమె మృతదేహం వద్దనే కూర్చొని ఏడవడం ఆరంభించాడు. ఆకలికి తాళలేక తల్లి పాలకోసం వెంపర్లాడాడు. అయినా ఆమె లేవకపోవడంతో..మృతదేహంపైన కూర్చొని మారాం చేశాడు. చాలాసేపటి తర్వాత చిన్నారి ఆవేదనను గమనించిన చుట్టుపక్కలున్న ప్రయాణికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు.

ఆమె మరణించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పాలు, బిస్కెట్లు ఇచ్చి చిన్నారిని సముదాయించేందుకు యత్నించినా.. ఆ బాలుడు వాటిని స్వీకరించలేదు. అలాగే గంటల తరబడి వెక్కివెక్కి ఏడ్చిన బాలుడు.. చివరికి తల్లి మృతదేహం పక్కనే తెల్లవారుజాము వరకు నిద్రించాడు.
ఘట్‌కేసర్ సీఐ ప్రకాష్, ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలికి చేరుకుని మూర్ఛ కారణంగా మహిళ మృతి చెందినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో శుక్రవారం తెల్లవారుజూమున సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి బాలుడిని తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు. మృతురాలు గురించి తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.