ఘోరం: వివాహితను వేధిస్తున్నాడని నడిరోడ్డుపై యువకుడిని చంపేసిన ఆమె కుటుంబం
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వివాహితను వేధిస్తున్న ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి చంపేశారు. అందరూ చూస్తుండగానే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ మారాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం మహేశ్(24) అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగించాడు. అయితే, గత సంవత్సరం యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా ఉన్నవీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యువతి భర్తకు కూడా పంపించినట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల క్రితం యువతికి విడాకులు ఇచ్చిన ఆమె భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో యువతి తన పుట్టింటికి వచ్చింది.
పుట్టింటికి వచ్చిన యువతిని పలుమార్లు వేధిస్తూ వచ్చాడు మహేశ్. దీంతో ఆమె కుటుంబసభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం ఉదయం మహేశ్ పాలు పోసేందుకు వెళుతుండగా అడ్డగించి.. దాడికి పాల్పడ్డారు యువతి కుటుంబసభ్యులు. మహేశ్‌పై కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత యువతి తండ్రి అతడిపై బండరాయితో పలుమార్లు దాడి చేశాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మహేశ్ మృతి చెందాడు. స్థానికులు చూస్తూ వీడియోలు తీశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మహేశ్‌ను చంపిన నిందితులను తమకు అప్పగించాలతంటూ మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు. ప్రేమ పేరుతో మహేశ్‌తో ఆ యువతి భారీగా డబ్బు ఖర్చు పెట్టించిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications