• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోహిత్ ఆత్మహత్య: ఎబివికి అస్త్రాన్ని అందించిన తండ్రి మణికుమార్

By Pratap
|

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు) విద్యార్థి వేముల రోహిత్ తండ్రి వేముల మణికుమార్ ఎబివిపికి ఆయుధాన్ని అందించినట్లే ఉన్నారు. ఆయన ప్రకటనను ఆసరా చేసుకుని ఎబివిపి ఎదురుదాడికి దిగుతోంది.

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని తండ్రి మణికుమార్ అనుమానిస్తున్నారు. అది హత్య కూడా కావచ్చునని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినయ్ బిద్రే డిమాండ్ చేశారు. రోహిత్ మృతికి బాధ్యులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు.

బుధవారం ఎబివిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రోహిత్ మరణం పూర్వాపరాలు- వాస్తవాలను వివరించేందుకు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3వరకూ ప్రచారోద్యమం చేపడతామని చెప్పారు. రోహిత్ మరణం వెనుక నిజానిజాలను ప్రజలకు, విద్యార్థులకు వివరిస్తామన్నారు.

ABVP demands enquiry on Rohith Vemula's death

ఢిల్లీ, బీహార్, కేరళ, అహ్మదాబాద్, చెన్నై, త్రివేండ్రం , కోల్‌కటా సెంట్రల్ వర్శిటీల్లో పెద్దఎత్తున సెమినార్లు నిర్వహిస్తామని, కరపత్రాలు పంచుతామని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో పెద్దఎత్తున అసాంఘిక శక్తులు, యాకుబ్ మెమెన్ అనుచరులు ఉన్నారని, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వీటికి వర్శిటీలోని ప్రొఫెసర్లే మద్దతు పలుకుతున్నారన్నారు.

ముఖ్యంగా లక్ష్మీనారాయణ, సౌమ్య దేచమ్మ, తథాసేన్ గుప్త, కెవై రత్నం, హరిబాబు, హరగోపాల్, అపర్ణ తదితరులపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. హెచ్‌సియులో అసాంఘిక శక్తుల ఆగడాలను ఉపేక్షించేది లేదని, ఉద్ధృతరీతిలో అడ్డుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీల రాజకీయ నాయకులు హెచ్‌సియుకు వచ్చి దాన్ని రాజకీయం చేసి దళిత, దళితేతరుల మధ్య పోరాటంగా చిత్రీకరించటం సిగ్గుచేటు అని బిద్రే అన్నారు

ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఉద్యమాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ కేజ్రీవాల్‌ను రాష్ట్రపతి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఊచకోతకు గురైన మాల్దాను, అలీగఢ్ వర్శిటీని కేజ్రీవాల్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. పఠాన్‌కోట్‌కు కేజ్రీవాల్ ఎందుకు పోలేదని నిలదీశారు.

ABVP demands enquiry on Rohith Vemula's death

ఇది దేశ భక్తులు, జాతీయ వాదులు, సంఘ విద్రోహశక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, అలాగే వామపక్షాలు, ఎంఐఎం, కేరళ, జమ్మూకాశ్మీర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన తీవ్రవాదుల, మద్దతుదారులు ఈ అంశాన్ని తీసుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని, వాటిని ఎబివిపి చూస్తూ ఊరుకోదని, తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని అన్నారు.

కాంగ్రెస్‌కు చెందిన జైపాల్‌రెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పెద్దఎత్తున డబ్బులు కుమ్మరిస్తూ ఎఎస్‌ఎను రెచ్చగొడుతున్నారని , త్వరలోనే వీరి బండారం బయటపెడ్తామని, ఎఎస్‌ఎ నేతలు కుట్రలు మానుకుని హెచ్‌సియు విద్యార్ధులు తరగతులకు హాజరయ్యేలా చూడాలని కోరారు.

జ్యుడీషియల్ విచారణలో రోహిత్ కుల ధృవీకరణ పత్రాలు, రోహిత్ సహచరులు దొంత ప్రశాంత్, విజయ్‌కుమార్, శేషయ్య, సుంకన్నలను విచారణ జరపాలని, వీరిని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్లను విచారించాలని డిమాండ్ చేశారు.

సుశీల్‌పై ఎలాంటి దాడి జరగలేదని పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తప్పుడు అఫిడవిట్ కోర్టులో దాఖలు చేశారని, మొదటి చార్జిషీట్ కొట్టివేసి రెండో చార్జిషీట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడంపై సివి ఆనంద్ జవాబు చెప్పాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప, జాతీయ కార్య సమితి సభ్యురాలు హరిత, నగర కార్యదర్శి వెంకట్‌రెడ్డిలు అన్నారు.

ఆత్మహత్య లేఖలో కొట్టివేసిన వ్యాఖ్యల్లో రోహిత్ ఎఎస్‌ఎ, ఎస్‌ఎఫ్‌ఐపై ఆరోపణలు చేసినా కూడా ఎలాంటి ఫోరెన్సిక్ విచారణ జరపకుండా వారిపై చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులు, మేథావులు గమనించాలని హెచ్‌సియు నేతలు రాజు, సూరజ్, ఒయు నేతలు ఎల్లాస్వామి, శ్రీహరి చంద్రశేఖర్‌లు కోరారు.

English summary
ABVP leader Vinay Bidre demanded enquiry on Hyderabad Central University (HCU) student Vemula Rohith's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X