నోటుకు ఓటు: సెబాస్టియన్ అలవాటే చంద్రబాబును ఇరికించిందా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకుడు సెబాస్టియన్ అలవాటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ఇరికిస్తుందనే మాట వినిపిస్తోంది. చంద్రబాబు విషయంలో తెలంగాణ ఎసిబి అధికారులు పూర్తిగా సెబాస్టియన్ ఫోన్ కాల్ రికార్డుల ఆధారపడినట్లు చెబుతున్నారు. సెబాస్టియన్‌కు తనకు వచ్చే ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసే అలవాటు ఉందని సమాచారం.
సెబాస్టియన్ అలవాటు కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన మాటలు కూడా రికార్డయ్యాయని చెబుతున్నారు. సెబాస్టియన్ తన ఫోన్ కలిపి బాస్ మాట్లాడుతారని స్టీఫెన్‌సన్‌కు చెప్పి ఫోన్‌ను చంద్రబాబుకు అందించారని, చంద్రబాబు అదే ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు.
మనవాళ్లు అంతా చెప్పారని, మనం కలిసి పనిచేద్దామని, అన్ని హామీలకు తాను కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో చెప్పిన విషయాల ఆడియో రికార్డింగులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని, సెబాస్టియన్, ఉదయసింహలను ఎసిబి అధికారులు మే 31వ తేదీన రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సెల్‌ఫోన్లను, రూ. 50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

సెబాస్టియన్ హెచ్‌టిసి ఫోన్‌లో మే 23 నుంచి మే 31వ తేదీ వరకు రికార్డైన సంభాషణలను బట్టి సండ్ర ఆయనతో పలుమార్లు మాట్లాడినట్లు బయటపడింది. ఆ సంభాషణల ఆధారంగానే ఎసిబి అధికారులు సండ్రను అరెస్టు చేశారు. అవే రికార్డులు చంద్రబాబును కూడా పట్టిస్తున్నట్లు చెబుతున్నారు.
సెబాస్టియన్ మే 30వ తేదీన తనతో మాట్లాడి చంద్రబాబుకు ఫోన్ ఇచ్చారని స్టీఫెన్‌సన్ తన వాంగ్మూలంలో చెప్పారు. బోయిగూడలోని నివాసంలో రేవంత్ రెడ్డి తనను కలిసే విషయాన్ని నిర్ధారించడానికి సెబాస్టియన్ తనకు పలుమార్లు ఫోన్ చేశారని కూడా స్టీఫెన్‌సన్ చెప్పారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కూడా సంభాషణలను ధ్రువీకరించింది.
స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన తేదీని, సమయాన్ని గుర్తించిన ఎసిబి అధికారులు మరింత ముందడుగు వేశారు. ఆ సయమంలో చంద్రబాబు, సెబాస్టియన్ ఒకే టవర్ లొకేషన్‌లో ఉన్నట్లు గుర్తించారు. జిమ్మీ బాబు కూడా సెబాస్టియన్‌తో మాట్లాడినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మొత్తం మీద, సెబాస్టియన్ అలవాటు మొత్తం వ్యవహారాన్ని తలకిందులు చేసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications